నేడు భారత్‌ బంద్

నేడు భారత్‌ బంద్
బంద్‌కు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, టీడీపీ, వైసీపీ, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతు సంఘాలు భారత్‌ బంద్ చేపట్టాయి. ఉదయం 6 గంటలకు మొదలైన బంద్ సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్‌ చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు నిర్ణయించారు. అలాగే, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ సైతం మూసివేయాలని నిర్ణయించారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రైతు నేతలు. అంబులెన్స్‌, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. బంద్‌తో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది..

సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చిన ఈ 12 గంటల బంద్‌కు కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, టీడీపీ, వైసీపీ, సీపీఎం, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అటు పలు రైతు సంఘాలు, కార్మిక, విద్యార్థి సంఘాలు, బార్‌ అసోసియేషన్లు కూడా బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వామపక్షాలు..వ్యాపారస్థులు, ప్రజలకు బంద్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు.

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 4 నెలలగా ఢీల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలతో పాటు యూపీకి చెందిన కొందరు రైతులు సింఘు, ఘాజీపూర్‌, టిక్రీ సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story