Sampreeti Yadav: వావ్ గ్రేట్ సంప్రీతి.. గూగుల్‌లో ఉద్యోగం.. ఏడాదికి రూ.1.10 కోట్ల జీతం

Sampreeti Yadav: వావ్ గ్రేట్ సంప్రీతి.. గూగుల్‌లో ఉద్యోగం.. ఏడాదికి రూ.1.10 కోట్ల జీతం
Sampreeti Yadav: బీహార్‌లోని పాట్నా నగరానికి చెందిన సంప్రీతి యాదవ్ ఫిబ్రవరి 14, 2022న గూగుల్‌లో చేరబోతోంది.

Sampreeti Yadav: పాట్నా అమ్మాయి సంప్రీతి యాదవ్ గూగుల్‌లో రూ. 1.10 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను గర్వపడేలా చేసింది.

వివిధ నేపథ్యాల విద్యార్థులు అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందడం నిజంగా అభినందనీయం. ఇప్పుడు బీహార్‌కు చెందిన మరో ఇంజినీరింగ్ విద్యార్థి గూగుల్‌లో రూ.1.10 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించడం గర్వకారణం అని ఆమెకి చదువు చెప్పిన కాలేజీ లెక్చరర్లు ఆనందపడుతున్నారు.

బీహార్‌లోని పాట్నా నగరానికి చెందిన సంప్రీతి యాదవ్ ఫిబ్రవరి 14, 2022న గూగుల్‌లో చేరబోతోంది. తండ్రి రామశంకర్ యాదవ్ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి, తల్లి శశిప్రభ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

సంప్రీతి ఎప్పుడూ చదువులో ముందుంటుంది. 2014లో నోట్రే డామ్ అకాడమీ నుండి 10 CGPAతో మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఇంటర్నేషనల్ స్కూల్ నుండి 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమె 2016లో జేఈఈ-మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది.

గత సంవత్సరం మే 2021లో, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలెక్షన్స్‌లో అడోబ్, ఫ్లిప్‌కార్ట్‌తో సహా నాలుగు అగ్రశ్రేణి కంపెనీలు ఉద్యోగం ఆఫర్ చేశాయి. రూ. 44 లక్షల వార్షిక ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్‌లో జాయినయింది.

అక్కడ జాబ్ చేస్తుండగానే గూగుల్‌కు ప్రయత్నించింది. 9 రౌండ్ల ఇంటర్వ్యూలను క్లియర్ చేసిన తర్వాత, గూగుల్ ఆమెను సెలెక్ట్ చేసి రూ. 1.10 కోట్ల వార్షిక ప్యాకేజీని అందించింది.

గూగుల్‌‌లో ఎలా ఉద్యోగం సంపాదించావు అని అడిగిన ప్రశ్నకు సంప్రీతి.. కాలేజీ ప్లేస్‌మెంట్‌లతో పాటు, తనంతట తానుగా ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పింది. రెజ్యూమ్ గూగుల్‌కి పంపించానని, దానిని పరీశీలించిన అనంతరం 9 రౌండ్ల ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారని చెప్పింది.

ఇంత డబ్బుతో ఏం చేస్తారని అడిగితే ఉద్యోగం లండన్‌లో ఉందని, అందువల్ల అక్కడ జీవన వ్యయం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయినప్పటికీ, ఆమె తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయనని చెప్పింది. లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తే ప్రతిఫలం లభిస్తుంది అని సంప్రీతి పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story