Mulayam's funeral: ములాయం అంత్యక్రియలకు ప్రముఖులు హాజరు..

Mulayams funeral: ములాయం అంత్యక్రియలకు ప్రముఖులు హాజరు..
Mulayam's funeral: ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ములాయంసింగ్ యాదవ్‌ పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

Mulayam's funeral: ములాయంసింగ్‌ యాదవ్‌ అంతక్రియలకు ప్రత్యేక విమానంలో బయల్దేరారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ములాయంసింగ్ యాదవ్‌ పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ సైతం మరికాసేపట్లో యూపీ బయల్దేరుతున్నారు.

సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యూపీ వెళ్తున్నారు. అంత్యక్రియలు ముగిసిన తరువాత సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. ములాయం స్వగ్రామం ఎటావా జిల్లా సఫాయి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం పార్ధివదేహాన్ని ఉంచారు.

ములాయం స్వగ్రామంలోనే అంత్యక్రియలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ములాయం పార్థివదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, ఛత్తీ‌స్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు.

ములాయంసింగ్‌ చనిపోవడంతో యోగి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ములాయంసింగ్‌ కన్నుమూశారన్న వార్త తెలిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆస్పత్రికి వెళ్లి ములాయం పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు.

జోడో యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ.. ములాయం మరణవార్త వినగానే ఐదు నిమిషాలు మౌనం పాటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాష్ట్ర మంత్రులు, అన్నిపార్టీల ముఖ్య నేతలు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story