దేశవ్యాప్తంగా కాస్త తగ్గిన కరోనా కేసులు..!

దేశవ్యాప్తంగా కాస్త తగ్గిన కరోనా కేసులు..!
దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి.

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్ 12న 1.68 లక్షల కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో లక్షా 61 వేల 736 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 36 లక్షల 89 వేల 453కి చేరింది. కొత్తగా 97 వేల 168 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య కోటి 22 లక్షల 53 వేల 697కు చేరగా.. రికవరీ రేటు 89.86 శాతానికి తగ్గింది.

ఇక కరోనా మరణాలు సోమవారం ఒక్కరోజు 904 నమోదు కాగా.. ఆ సంఖ్య మంగళవారానికి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 879 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 71 వేల 58కి చేరింది. ఇక మరణాల రేటు 1.26 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 లక్షల 64 వేల 698యాక్టివ్ కేసులు వెలుగుచూశాయి.

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 40.04 లక్షల మంది టీకా వేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 10 కోట్ల 85 లక్షల 33 వేల 85కు చేరింది. ఇక మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 51 వేలకు పైగా కేసులు.. 258 మరణాలు నమోదయ్యాయి.

కరోనా ఉధృతి ఉగ్రరూపం దాల్చుతుండటంతో మహారాష్ట్ర సర్కారు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. లాక్‌డౌన్ అమలుపై మరో రెండు, మూడ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story