జాతీయం

భారత్‌లో ముంచుకొస్తున్న థర్డ్‌వేవ్ ముప్పు..!

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత దేశంలో కొవిడ్ మహమ్మారి కథ ముగిసిందని అందరూ భావించారు.

భారత్‌లో ముంచుకొస్తున్న థర్డ్‌వేవ్ ముప్పు..!
X

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత దేశంలో కొవిడ్ మహమ్మారి కథ ముగిసిందని అందరూ భావించారు. కరోనా కట్టడిలో భారత్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా కూడా కొనియాడారు. అదే సమయంలో రోజువారీ పాజిటీవ్ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అందరూ వైరస్‌ను ఓడించామనే ఆనందంలో మునిగి తేలారు. రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజానీకం వరకు దేశం మహమ్మారి నుంచి బయటపడిందని భావించారు. ఎన్నికలు, క్రీడలు మొదలుకొని రోజువారీ కార్యకలాపాలు యథావిథిగా సాగాయి. జనం ఇష్టారీతిన.. మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా తిరిగారు.

ఇంకేముంది కరోనా మహమ్మారి నుంచి బయటపడినట్లే అని భావించిన తరుణంలో నెల రోజుల్లోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. భారత్ దారుణమైన కరోనా సెకండ్‌ వేవ్‌ గుప్పిట్లో చిక్కుకుంది. కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు కాగా.. కరోనా బారిన పడిన వేలాది మంది మృతి చెందడంతో దేశంలో మృత్యుఘోష మోగింది. దేశ ప్రజారోగ్య అత్యవసర స్థితి గుప్పిట్లో విలవిలలాడింది. కిక్కిరిసిన శ్మశానాల్లో కరోనా మృతుల అంత్యక్రియలు, ఆస్పత్రుల బయట మృతదేహాల కోసం ఎదురుచూసే కుటుంబాలు, బెడ్స్, ఆక్సిజన్ కొరతతో శ్వాస అందని రోగులతో ఆస్పత్రుల బయట నిలిచిన అంబులెన్సులు, శవాలతో నిండిన మార్చురీలు నిండిపోయాయి. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధించినా.. దేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినా.. అప్పటికే జరిగిన నష్టం జరిగిపోయింది. సెకండ్‌వేవ్‌ రేపిన బీభత్సం ఇంకా దేశ ప్రజల కళ్లముందు నుంచి చెదిరిపోలేదు.

దేశంలో సెకండ్‌ వేవ్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు. అయితే కొవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ.. కరోనా ఇంకా వీడలేదని.. థర్డ్‌వేవ్ రూపంలో ముప్పు పొంచి ఉందని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకొచ్చేశారు. కరోనా నిబంధనలను సైతం గాలికొదిలేశారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత జూన్, జులై నెలల్లో దాదాపు 75 శాతం మంది ప్రజలు మాస్కులు వాడటం తగ్గించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్లు.. డెల్టా, జీకా వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్లు మరింత పెరిగే అవకాశం ఉందని.. దీంతో పాటు పలు దేశాల్లో కరోనా తిరిగి విజృంభిస్తోందని.. ప్రపంచం థర్డ్‌వేవ్‌ దిశగా వెళ్తుంది అనేందుకు ఇది నిదర్శనమని కేంద్ర ఆరోగ్యశాఖ సహా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

రానున్న వంద రోజులు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని హెచ్చరించింది. యావత్‌ ప్రపంచం మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న వేళ.. దేశ ప్రజలు బాధ్యతగా వ్యవహరించి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. మరోవైపు.. దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు కఠిన జాగ్రత్తలు అవసరమని ఎయిమ్స్ నిపుణులు సూచించారు. ఇక.. థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధమైంది. వ్యాక్సిన్లు, సరిపడా వైద్య సామాగ్రిని నిల్వ చేస్తోంది.

Next Story

RELATED STORIES