మాజీ సీఎం మరదలు.. వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ..

మాజీ సీఎం మరదలు.. వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ..
చింపిరి జుట్టుతో సన్నగా, వెలిసిన నీలిరంగు నైట్‌గౌన్ ధరించిన ఒక మహిళ పశ్చిమ బెంగాల్‌ వీధుల్లో తిరగుతూ భిక్షాటన చేసుకుంటోంది.

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు ఇరా బసు బెంగాల్‌ డన్‌లాప్‌లోని ఫుట్‌పాత్‌ మీద నివసిస్తున్నారు. అంతకుముందు, ఆమె 34 సంవత్సరాలు లైఫ్ సైన్సెస్ టీచర్‌గా పనిచేశారు.

చింపిరి జుట్టుతో సన్నగా, వెలిసిన నీలిరంగు నైట్‌గౌన్ ధరించిన ఒక మహిళ పశ్చిమ బెంగాల్‌ వీధుల్లో తిరగుతూ భిక్షాటన చేసుకుంటూ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తోంది. పూర్వ విద్యార్థులు ఆమెని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలకు పైగా నడిపారు.

ఇరా బసు వైరాలజీలో పిహెచ్‌డి చేశారు. ఇంగ్లీష్, బెంగాలీ భాషలను అనర్గళంగా మాట్లాడుతున్నారు. తాను రాష్ట్ర స్థాయి అథ్లెట్ మరియు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అని క్రికెట్ కూడా ఆడేదాన్నని ఆమె చెబుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ప్రియనాథ్ బాలికల ఉన్నత పాఠశాలలో 1976లో లైఫ్ సైన్సెస్ టీచర్‌గా సేవలందించిన ఇరా బసు బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా సోదరి. జూన్ 28, 2009 న, ఆమె ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. బుద్ధదేవ్ భట్టాచార్య అప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆ సమయంలో, ఆమె బరానగర్‌లో నివసించారు మరియు తరువాత పశ్చిమ బెంగాల్‌లోని ఖర్దాలోని లిచు బగన్ ప్రాంతానికి వెళ్లారు. కానీ కొన్ని రోజులకు ఆమె అకస్మాత్తుగా అక్కడినుండి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి ఆమె కోల్‌కతా వీధుల్లో తిరుగుతున్నారు.

ప్రియనాథ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణకాళి చందా మాట్లాడుతూ, "ఇరా బసు ఈ పాఠశాలలోనే బోధించేవారు. ఆమె పదవీ విరమణ తర్వాత, మేము ఆమె పెన్షన్ పొందడానికి చొరవ తీసుకున్నాము. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించమని కోరాము. కానీ ఆమె ఆపని చేయలేదు, పత్రాలు సమర్పించలేదు పెన్షన్ రాలేదు అని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఆమె దీనస్థితిని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.

'నాకు విఐపి ఐడెంటిటీ వద్దు'

ఉపాధ్యాయ దినోత్సవం నాడు, అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 న, ఇరా బసును డన్‌లాప్‌లోని 'ఆర్ట్యాజోన్' అనే సంస్థ సభ్యులు సన్మానించారు. ఆమెకు పూలమాల వేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "టీచర్లందరూ ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నారు.. చాలా మంది విద్యార్థులు నన్ను ఇంకా గుర్తుంచుకున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కంటతడి పెట్టుకుంటున్నారు.

బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబంతో ఆమెకున్న సంబంధం గురించి మాట్లాడుతూ "నేను స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు అతడి నుండి ఎలాంటి ప్రయోజనాలు పొందాలనుకోలేదు. నేను నా స్వంత కాళ్లమీద నిలబడాలనుకున్నాను. మా కుటుంబ సంబంధాల గురించి చాలామందికి తెలిసినప్పటికీ నాకు VIP గుర్తింపు అక్కర్లేదు."

ఇరా బసు ప్రస్తుత జీవన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ఆమెను డన్‌లోప్ ప్రాంతం నుండి వైద్య పరీక్షల కోసం కోల్‌కతాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. నేడు అనుసరిస్తున్న ఆన్‌లైన్ విద్యపై ఆమెకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఆన్‌లైన్ తరగతులకు మద్దతు ఇవ్వలేను. విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా నేర్చుకున్న విద్యను ఆచరణలో పెట్టడం అస్సలు సాధ్యం కాదని ఆమె అంటున్నారు. .

Tags

Read MoreRead Less
Next Story