Hockey Player Malti: హాకీలో స్టేట్ లెవెల్ ఛాంపియన్.. ఆటో నడుపుతూ..

Hockey Player Malti: హాకీలో స్టేట్ లెవెల్ ఛాంపియన్.. ఆటో నడుపుతూ..
Hockey Player Malti:

Hockey Player Malti: అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది.. ఎంతో ఇష్టంగా హాకీ స్టిక్ చేతబట్టింది.. నాన్నకి ఇష్టం లేకపోయినా ఆటపై మక్కువతో ఆడిన చోటల్లా ప్రశంసలు దక్కించుకుంది. ఆరేళ్ల వయసులోనే ఆడడం మొదలు పెట్టి రాష్ట్రస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది లక్నోలో పుట్టి పెరిగిన మాల్టీ.

మ్యాచ్ ల కోసం ఆగ్రా, మధ్యప్రదేశ్, ఒడిశాకు వెళ్లడాన్ని ఆమె గుర్తు చేసుకుంది. తన జీవితంలో అది గోల్డెన్ పీరియడ్ గా చెప్పుకుంటుంది మాల్టీ. హకీ క్రీడతో హాయిగా సాగిపోతున్న తన బాల్యానికి బంధం వేశాడు తండ్రి. పెళ్లి చేసి అత్తారింటికి పంపాడు.


ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమెకు అవమానాలు, శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసేవాడు భర్త. పెళ్లైన నాలుగేళ్లకు కొడుకు పుట్టాడు. అయినా భర్తలో మార్పు లేదు. వేధింపులు ఆగలేదు. ఆ బాధ భరించలేక కొడుకుని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది మాల్టీ. సొంతంగా బతకాలనుకుంది కానీ చేతిలో చిల్లిగవ్వలేదు.. ఏం చేద్దామన్నా పనిలేదు.

ఆమెకి తెలిసింది హాకీ మాత్రమే. హాకీ కోచ్‌గా ఉద్యోగం వెతుక్కుందామని నిర్ణయించుకుంది. లక్నోలోని బాబు బనారసి దాస్ విశ్వవిద్యాలయంలో కోచ్ పోస్ట్ కి దరఖాస్తు చేసింది. అక్కడ బాలికల జట్టుకు కోచ్ గా ఉద్యోగం వచ్చింది.

తన కాళ్ల మీద తాను నిలబడే ధైర్యం వచ్చాక తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అయితే మళ్లీ దురదృష్టం పలకరించింది. ఉద్యోగంలో జాయినయిన రెండేళ్లకే కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చేస్తున్న హాకీ కోచ్ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

జీవితం మళ్లీ కష్టతరంగా మారింది . కుటుంబ పోషణ కోసం ఆమె పలుచోట్ల కూలి పనులు చేసింది. ఈ క్రమంలో లక్నోలోని 'హమ్‌సఫర్' ట్రస్ట్‌ గురించి తెలుసుకుంది. అది మాల్టీ జీవితాన్ని మార్చేసింది. అక్కడే ఇ-రిక్షా నడపడంలో శిక్షణ తీసుకుంది. ప్రభుత్వం సహాయంతో ఎటువంటి ఖర్చు లేకుండా రిక్షా కూడా ఆమెకు అందింది. లైసెన్స్ పొందే ప్రక్రియ కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారానే జరిగింది.

మాల్టీకి ఇంతకు ముందు ద్విచక్ర వాహనం తప్ప మరేదీ రాదు. అయినా బతకాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే పట్టుదలగా ఇ-రిక్షా నడపడం నేర్చుకుంది. నా జీవితంలో ఏదో ఒకటి చేయాలన్న ఆ కోరికే నన్ను రిక్షా నడపడానికి పురికొల్పింది" అని మాల్టీ చెబుతుంది.


లక్నో వీధుల్లో తాను రిక్షా నడిపిన మొదటి రోజును గుర్తుచేసుకుంది. 2013లో లక్నోలో ఆటోరిక్షా నడుపుతున్న ఏకైక మహిళను నేను. నన్ను అందరూ వింతగా చూడడం మొదలు పెట్టారు అని ఆరోజుల్ని గుర్తు చేసుకుంది.

చాలా మంది కస్టమర్లు తన డ్రైవింగ్ పై అనుమానం వ్యక్తం చేశారు. నా రిక్షాలో కూర్చోవడానికి నిరాకరించారు. అయినప్పటికీ, నేను పట్టుదలతో ప్రయత్నించాను. పరిస్థితులు మారాయి. ఇప్పుడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తోంది. కొడుకును పోషిస్తోంది. కుమారుడిని రాష్ట్ర స్థాయి హాకీ క్రీడాకారుడిగా తయారు చేసింది. కొడుకు అలోక్ మిశ్రా అమ్మ కష్టాన్ని చూడలేకపోతున్నాడు.

హాకీ పట్ల ఆమెకున్న అభిరుచిని నేను చూశాను. నేను హాకీ ఆడుతున్నందుకు అమ్మ చాలా సంతోషంగా ఉంది అని చెబుతున్నాడు. ఇన్ని సంవత్సరాలలో, ఆమె ఎప్పుడూ నేను మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంది. నేను కూడా అలాగే ఆడుతున్నాను అని తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story