Jayalalitha : జయలలిత డెత్ మిస్టరీ.. సీఎం స్టాలిన్ టేబుల్‌‌పై 500 పేజీల రిపోర్ట్

Jayalalitha : జయలలిత డెత్ మిస్టరీ.. సీఎం స్టాలిన్ టేబుల్‌‌పై 500 పేజీల రిపోర్ట్
Jayalalitha Death Mystery: ఒక్క మరణం.. వందల ప్రశ్నలు.. అన్నింటికీ మించి సీఎంగా ప్రమాణం చేయడానికి ఆ కొన్ని గంటల ముందు ఏం జరిగింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తమిళులతో పాటు యావత్ దేశాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది.

Jalalitha Death Report: ఒక్క మరణం.. వందల ప్రశ్నలు.. అన్నింటికీ మించి సీఎంగా ప్రమాణం చేయడానికి ఆ కొన్ని గంటల ముందు ఏం జరిగింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తమిళులతో పాటు యావత్ దేశాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. అయితే, ఐదేళ్లకుపైగా అందరినీ వెంటాడుతున్న జయ డెత్ మిస్టరీ వీడే టైం వచ్చేసింది.


జయలలిత మరణం ఎలా సంభవించింది..? అనారోగ్య కారణాలతోనే అమ్మ తుదిశ్వాస విడిచారా..? లేక కుట్రకోణం ఉందా అన్నదానికి సంబంధించి దాదాపు 500 పేజీల రిపోర్ట్ సీఎం స్టాలిన్ టేబుల్‌‌పై ఉంది. ఇంతకూ, తమిళనాడు దివంగత సీఎం డెత్ రిపోర్ట్‌లో ఏముంది..? అపోలో ఆస్పత్రిలో చేరడానికి కొన్ని గంటల ముందు అసలేం జరిగింది..?

ఐదేళ్లకుపైగా జయలలిత మరణం అంతులేని మిస్టరీగా మారింది. ఒక్కటి రెండూ కాదు కొన్ని వందల ప్రశ్నలు తమిళులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వాటిలో ప్రధాన ప్రశ్న 2016లో సీఎంగా ప్రమాణం చేయబోయే కొన్ని గంటల ముందు ఏం జరిగిందన్నదే. ఓ వైపు ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. ఉన్నట్టుండి ఆమె అనారోగ్యానికి గురయ్యారు.


చివరికి ప్రమాణ స్వీకార ముహూర్తానికి తాత్కాలికంగా మందులు తీసుకుని కార్యక్రమాన్ని ముగించేశారు. కట్ చేస్తే రోజుల వ్యవధిలోనే జయ ఆరోగ్యం మరింత క్షీణించింది. అనంతరం అపోలో ఆస్పత్రిలో చేరడం, 75 రోజులు ప్రాణాలతో పోరాడడం, చివరికి కోట్లాది మంది తమిళులను శోకసంద్రంలో ముంచేస్తూ తుదిశ్వాస విడిచారు. సరిగ్గా ఇక్కడే అమ్మ మరణం అంతుచిక్కని రహస్యంగా మారింది.

ఓవైపు జయలలిత మరణాన్ని తమిళులు జీర్ణించుకోలేపోతోంటే మరోవైపు అక్కడి రాజకీయాలు మొత్తం తలైవి మరణం చుట్టే తిరగడం మొదలైంది. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమెకు అందించిన చికిత్స దగ్గర నుంచి మొదలు పెట్టి సీఎంగా ప్రమాణం చేయబోయే ముందు అసలేం జరిగిందన్న ప్రశ్న వరకూ ప్రతి అంశంపైనా రాజకీయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అందులోనూ జయలలిత నెచ్చెలి శశికళ, పార్టీ నేతలు సహా ఎవ్వరినీ జయతో కలవనివ్వకపోవడం కూడా ఆ అనుమానాలకు తావిచ్చింది.

జయ మరణంపై విచారణ జరిపించాల్సిందిగా శశికళ కోర్టు మెట్లెక్కడం, అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేసిన విజ్ఞప్తులతో అర్ముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. 2017 నవంబర్‌లో కమిషన్ విచారణ షురూ చేసింది. జయలలిత సన్నిహితులు, ఆమెకు చికిత్స అందించిన వైద్యులు, అప్పటి తమిళనాడు ఆరోగ్యమంత్రి విజయ భాస్కర్, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం తదితరులను విచారించింది. దాదాపుగా 150 మంది కమిషన్ ఎదుట హాజరై జయలలిత మరణానికి సంబంధించి తమ వద్ద ఉన్న కీలక సమాచారాన్ని అందించారు.

2016 సెప్టెంబర్ 28న జయ ఆరోగ్యం క్షీణించడం దగ్గర నుంచి డిసెంబర్ 5న మరణించడం వరకూ ఏరోజు ఏం జరిగిందనే వివరాలు అపోలో వైద్యులు తెలిపారు. 2016 సెప్టెంబర్ 28న జయలలిత ఆరోగ్యం క్షీణించడం, ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం లాంటి పరిణామాలతో అక్టోబర్ 7న జయకు ట్రాక్టియోస్టమీ చికిత్సను ప్రారంభించారు.


అక్టోబర్ 14 నుంచి లండన్ డాక్టర్ రిచర్డ్‌ బిలే, ఎయిమ్స్ వైద్యులు, అపోలో వైద్యులు జయకు చికిత్స అందించారు. డిసెంబర్ 3 నాటికి జయ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ తర్వాత డిసెంబర్ 4న శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో జయకు ఎక్మో ఏర్పాటు చేసి 24 గంటల పాటు పర్యవేక్షించారు. చివరికి డిసెంబర్ 5న గుండె, మెదడు పని చేయకపోవడంతో మృతి చెందారు. ఓవరాల్‌గా జయకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదనేది ఇప్పటి వరకూ వచ్చిన పలు నివేదికలు చెబుతున్నాయి.


ఇక తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్ముగస్వామి రిపోర్ట్‌లో అనేక సీక్రెట్స్ బయటపడుతున్నాయి. జయ చికిత్స పొందుతున్న ఫ్లోర్‌లో సీసీ కెమెరాల విషయంలో హైడ్రామా నడిచిందని. ఆ ఫ్లోర్‌ మొత్తం సీసీ కెమెరాలు ఆపేసి మరీ వైద్యం అందించడం, ఆమె ఆరోగ్యస్థితిని దాచిపెట్టడం, శశికళపైనా అనుమానాలుండటంతో ఏదో జరిగిందనే ఆరోపణపై తీవ్ర చర్చలే సాగుతున్నాయి.


సీఎం స్థాయి వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పుడు, తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజీలు భద్ర పరచకపోవడంపై కమిషన్‌ అనుమానం వ్యక్తంచేసింది. అయితే జయలలిత ఫైనల్ డెత్ రిపోర్ట్ తమిళనాడు అసెంబ్లీ ముందుకు వచ్చింది. జయలలిత మరణంపై కీలక చర్చ జరగిన తరువాత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఏ రోజు తలైవి మర్డర్ మిస్టరీ పూర్తిగా వీడుతుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story