కరోనా పంజా.. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌

కరోనా పంజా.. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌
నాగ్‌పూర్‌లో..మార్చి 15-21 వరకు నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. మరో సారి పంజా విసురుతోంది. నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించగా.. తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ విధేంచేందుకు సిద్ధమైంది. నాగ్‌పూర్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15-21 వరకు నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి పెరుగుతున్న రోజూవారీ కేసులు..కొద్ది రోజులుగా 10వేలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం ఆ సంఖ్య 13,659కి చేరింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రధాన నగరాలైన ముంబయిలో 1,539, పుణెలో 1,384, నాగ్‌పూర్‌లో 1,513, నాసిక్‌లో 750, యావత్మల్‌లో 403, ఔరంగాబాద్‌లో 560, పింప్రిచించ్వాడ్‌లో 590 కరోనా కేసులు వెలుగుచూశాయి.

మార్చి 15 నుంచి 21 వరకు నాగ్‌పూర్ సిటీ పోలీస్‌ కమిషనరేట్ ప్రాంతం పూర్తిస్థాయి లాక్‌డౌన్ పరిధిలోకి వెళ్లనుంది. అత్యవసర సేవలకు మాత్రం ఏ అంతరాయం ఉండదని అధికారులు చెబుతున్నారు.

కరోనాను కట్టడిచేసేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏడు పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, హాట్‌ స్పాట్స్‌లో మాస్‌ టెస్టింగ్, వైరస్ సోకినవారి సన్నిహితులను పరీక్షించడం వంటివి ఆ ప్రణాళికలో భాగం. అన్ని జిల్లా యంత్రాంగాలు వాటిని పాటించాలని ఇదివరకే ఆరోగ్య శాఖ ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కేవలం అత్యవసర, ఎమర్జెన్సీ పనులు ఉన్నవారు మాత్రమే బయటికి రావాలన్నారు. రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తామన్నారు. అటు టీకా తీసుకునేందుకు ఎవరు సంకోచించవద్దని..అర్హులంతా టీకా తీసుకోవాలని ఆయన సూచించారు

Tags

Read MoreRead Less
Next Story