Rajasthan: రాజస్థాన్ రాజకీయాలు.. సీఎం అశోక్ గెహ్లాత్‌‌పై సోనియా సీరియస్

Rajasthan: రాజస్థాన్ రాజకీయాలు.. సీఎం అశోక్ గెహ్లాత్‌‌పై సోనియా సీరియస్
Rajasthan: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి సంగతేమో గాని.. ఇప్పుడు సీఎం పదవి కూడా ఊడిపోయేలా ఉంది.

Rajasthan: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది. రాజస్తాన్‌ సీఎం అశోక్ గెహ్లాత్‌ విషయంలో అచ్చంగా అదే జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి సంగతేమో గాని.. ఇప్పుడు సీఎం పదవి కూడా ఊడిపోయేలా ఉంది. త్వరలోనే అశోక్‌ గెహ్లాత్‌ స్థానంలో సచిన్‌ పైలెట్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశమూ కనిపిస్తోంది.

సీఎంగా తాము ఎవరిని నియమిస్తే.. వారికి మద్దతిచ్చి తీరాల్సిందేనంటూ అధిష్టానం తేల్చి చెప్పింది. కాదని ఎదురు తిరిగితే పదవులు కాదు కదా.. పార్టీ నుంచి సస్పెన్షన్ తప్పదని హెచ్చరించింది. ఇప్పటికే చీఫ్‌ విప్‌, ఇద్దరు మంత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. గెహ్లాత్‌ వర్గీయుడు మంత్రి ప్రతాప్‌ సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అధినేత్రి సీరియస్ అవుతున్నారని గ్రహించిన మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. అధిష్టానం చెప్పినట్టే వింటామని చెప్పారు.

అటు అశోక్ గెహ్లాత్‌కు కూడా ముచ్చెమటలు పట్టించారు సోనియా గాంధీ. ఎమ్మెల్యేల తిరుగుబాటులో తన పాత్రేమీ లేదని చెప్పినప్పటికీ అధిష్టానం వినిపించుకోలేదు. దీంతో.. స్వయంగా అశోక్‌ గెహ్లాతే మంత్రులు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై అధిష్టానానికి వ్యతిరేకంగా ప్రవర్తించొద్దని బుజ్జగించారు. దీంతో ప్రస్తుతానికి తిరుగుబాటు మొత్తం సద్దుమణిగింది.

రాజస్తాన్ పరిణామాలు అశోక్‌ గెహ్లాత్‌కు గట్టి దెబ్బ అనే చెప్పాలి. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవితో పాటు రాజస్తాన్‌ వ్యవహారాలను తన గుప్పిట్లోనే ఉండాలని ప్లాన్ చేశారు అశోక్ గెహ్లాత్. గాంధీ కుటుంబానికి విధేయుడుగా పేరున్న గెహ్లాతే ఇలా చేయడంతో సోనియా సైతం కఠిన నిర్ణయానికి సిద్ధపడుతున్నారు.

అధిష్టానం చెప్పింది విని సైలెంట్‌గా ఉన్న సచిన్‌ పైలెట్‌ను సీఎంగా చేయాలనే ఆలోచన అధిష్టానంలో మరింత బలంగా నాటుకుపోయింది. నిజానికి సచిన్‌ పైలెట్‌ను సీఎంగా నియమించేందుకు సోనియా గాంధీ కసరత్తు చేస్తున్నారు. ఇందుకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు.

కాని, ఈలోపే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడడం, ఢిల్లీ నుంచి వచ్చిన అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేను కలవకుండా హోటల్‌ రూముల్లోనే ఉండడంతో అధిష్టానం కొరడా ఝుళిపించింది. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికైనా సిద్ధమవడంతో అంతా దారికొచ్చారు.

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాత్‌ పేరును కూడా పక్కనపెట్టారు సోనియా గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటూ కమల్‌నాథ్‌ను సంప్రదించారు. ఈ విషయంపై కమల్‌నాథ్‌ను ఇప్పటికే ఢిల్లీకి పిలిచారు. అటు శశిథరూర్ కూడా ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దిగ్విజయ్ సింగ్‌ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మొత్తానికి గాంధీ కుటుంబానికి విధేయుడుగా పేరున్న అశోక్‌ గెహ్లాత్‌ ఒకే ఒక్క పరిణామంతో మొత్తం పరపతిని పోగొట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story