జర జాగ్రత్త.. పొంచి ఉన్న థర్డ్‌వేవ్.. ఈ 10 రోజుల కేసులు చూస్తే..

జర జాగ్రత్త.. పొంచి ఉన్న థర్డ్‌వేవ్.. ఈ 10 రోజుల కేసులు చూస్తే..
అవసరమైతేనే బయటకు వెళ్లండి అంటే కష్టంగానే ఉంది మరి. కానీ తప్పదు. ఉండాలి. లేదంటే కరోనా కాసుక్కూర్చుంది. మళ్లీ అటాక్ చేయడానికి.

అన్నీ వదిలేసి అయ్యో.. అస్సలు భయం లేదంటే ఎట్ల. మూతికి మాస్కులు పెట్టుకోవడమే కష్టంగా ఉంది. ఇంక దూరంగా జరగండి.. ఎక్కడికీ వెళ్లొద్దు. అవసరమైతేనే బయటకు వెళ్లండి అంటే కష్టంగానే ఉంది మరి. కానీ తప్పదు. ఉండాలి. లేదంటే కరోనా కాసుక్కూర్చుంది. మళ్లీ అటాక్ చేయడానికి. నిపుణులు అదే భయపడుతున్నారు. అడ్డదిడ్డంగా తిరిగేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి జరంత జాగ్రత్తగ ఉండమని ప్రాధేయపడుతున్నారు.

జూలై మొదటి 11 రోజుల్లో మహారాష్ట్రలో 88,130 కోవిడ్ -19 కేసులు నమోదవడం చూస్తే మూడవ వేవ్‌కు సంకేతంగా కనపడుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. రెండవ వేవ్‌లో 25 వేల కేసులు నమోదైన ఢిల్లీలో జూలై 1 నుంచి 11 మధ్య 870 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర కంటే ఎక్కువ కేసులు నమోదై దేశంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. జూలై 1 నుండి జూలై 10 వరకు కేరళలో 1,28,951 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో, కొల్లాపూర్ జిల్లాలో గత పక్షం రోజులుగా 3,000 కేసులు నమోదవుతున్నాయి, ముంబై గత మూడు రోజుల నుండి 600 కంటే తక్కువ కేసులను నమోదు చేస్తోంది. కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ, కొల్హాపూర్‌లో అత్యధిక టీకాలు వేసే సంఖ్యతో పాటు అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్నందున పరిస్థితి ప్రత్యేకమైనదని అన్నారు.

" డబుల్ మాస్కింగ్‌తో పాటు కోవిడ్ నియమావళికి కట్టుబడి ఉండకపోతే వైరస్ తన ప్రతాపాన్ని మరోసారి చూపిస్తుంది "అని జోషి అన్నారు. పెరుగుతున్న కేసులు కోవిడ్ గ్రాఫ్‌లో మరో ప్రమాదాన్ని సూచిస్తున్నాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ పాలనా యంత్రాంగం అప్రమత్తమై కోవిడ్ వ్యాప్తి అదుపుకు అవలంభించాల్సిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకత్వాలను ఉల్లంఘిస్తూ భారీ జనసమూహ కార్యక్రమాల పట్ల ప్రభుత్వాలు చూసీ చూడనట్లు ఉండడంపై భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) సోమవారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి అంశాలు కోవిడ్ మూడో దశకు దారితీసే అవకాశాన్ని కల్పిస్తుంది అని అంటున్నారు.

తీర్ధయాత్రలు, పర్యాటక ప్రాంతాల సందర్శనలు, మతపరమైన కార్యక్రమాలు వంటివి అవసరమేనని, అయితే అదే సమయంలో కొద్ది నెలలు ఆగితే మంచిదని, పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. లేకుంటే కోవిడ్ థర్డ్‌వేవ్ తధ్యమని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story