Pulses: దేశంలో మళ్లీ అమాంతంగా పెరిగిన పప్పుల ధరలు..

Pulses: దేశంలో మళ్లీ అమాంతంగా పెరిగిన పప్పుల ధరలు..
Pulses: దేశంలో మళ్లీ పప్పుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ పరిణామం పేదకుటుంబాలకు ఆర్థికభారంగా మారుతోంది.

Pulses: దేశంలో మళ్లీ పప్పుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ పరిణామం పేదకుటుంబాలకు ఆర్థికభారంగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లోనే పప్పులను రేషన్‌కార్డులపై ఇస్తున్నందున మిగతా ప్రాంతాలవారికి అవి కొనడం కష్టమవుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కందిపప్పు కిలోధర 120 నుంచి 130 రూపాయల వరకు పెరిగింది. మినపగుండ్లూ 130 నుంచి 140 రూపాయలకు చేరింది. ఈ రెండు నెలల్లోనే చిల్లర వ్యాపారులు కిలోకు అదనంగా 10 వరకు పెంచేశారు. ప్రధానంగా పప్పుధాన్యాల కొరత ధరల పెరుగుదలకు కారణమవుతోంది. దీనికితోడు డీజిల్, పెట్రోలు ధరలు పెరుగుతున్నందున... రవాణా ఖర్చులను రాబట్టుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో ఇంకాస్త ధర పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల దిగుబడులు గణనీయంగా పడిపోవడం ధరలపై ప్రభావం చూపుతోంది. రైతులు సాధారణంగా ఫిబ్రవరి నుంచే యాసంగి పప్పుధాన్యాలను అమ్మడానికి వ్యవసాయ మార్కెట్లకు తీసుకురావాలి. కానీ, కందులు, పెసలు, మినుముల దిగుబడులు తగ్గడం వల్ల సరిగా మార్కెట్లకు రావడం లేదు. దీంతో.. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేందుదుకు పప్పులను అక్రమంగా నిల్వలు పెడితే సహించేది లేదని తాజాగా టోకు వ్యాపారులను కేంద్రం హెచ్చరించింది. నిఘా పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం 12 లక్షల టన్నుల మేర కందిపప్పును దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. గత డిసెంబరులోనే ఏకంగా 2 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం.

గత జులై నుంచి డిసెంబరు దాకా కురిసిన అధిక వర్షాలు దేశంలో పప్పుధాన్యాల దిగుబడిని తగ్గేలా చేశాయి. అధికతేమతో తెగుళ్లు సోకి పైర్లు నాశనమైనట్లు కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. గతేడాది కందులు, మినుములు, పెసలు కలిపి మొత్తం కోటీ 22 లక్షల టన్నుల దిగుబడులు సాధించాలని కేంద్రం తొలుత లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ లక్ష్యం కంటే 24 లక్షల టన్నుల దిగుబడి తగ్గింది. కందులు 45.50 లక్షల టన్నులు రావాలని నిర్దేశిస్తే.. కేవలం 36.66 లక్షల టన్నులే వచ్చాయి. దిగుబడులపై వచ్చిన స్పష్టతతో డిసెంబరులోనే దిగుమతులు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణలో కందులు, మినుములు, పెసలను మద్దతు ధరకు కొనాలని కేంద్రం నిధులు మంజూరు చేసినా రైతులెవరూ అమ్మడానికి ముందుకు రాలేదని రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య- మార్క్‌ఫెడ్‌ చెబుతోంది. పంట దిగుబడులు తగ్గడం వల్ల ప్రైవేటు వ్యాపారులే రైతుల వద్దకెళ్లి అధిక ధరలిచ్చి పప్పుధాన్యాలను కొనేశారని.., అందుకే ప్రభుత్వానికి విక్రయించలేదని అధికారులు వివరించారు.

రాష్ట్రంలో కంది, పెసర, మినపపప్పులకు కొరత ఉంది. ఆశించిన స్థాయిలో ఈ పంటల సాగు విస్తీర్ణం పెరగకపోవడంతో పాటు అకాలవర్షాలతో, దిగుబడులు తగ్గడం వల్ల కొరత ఏర్పడింది. 2022-23లో కంది పంటను సాధారణ విస్తీర్ణానికి మించి 12 లక్షల ఎకరాల వరకూ సాగుచేయించాలని వ్యవసాయశాఖ తొలుత అంచనా వేసింది. కానీ చివరికి 5.65 లక్షల ఎకరాల్లో సాగైనట్లు ప్రభుత్వానికి వచ్చిన దిగుబడుల అంచనా నివేదికలో స్పష్టమైంది. రాష్ట్రంలో రైతులు కందుల అమ్మకానికి మార్కెట్లకు తెచ్చినప్పుడు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వ్యాపారులు సైతం కొని తీసుకెళ్లినందున ఇక్కడ కొరత ఎక్కువగా ఉంది. ఇక మినుము, పెసర పంటల సాగు, దిగుబడులూ తగ్గాయి.

Tags

Read MoreRead Less
Next Story