Nasa: ఆపరేషన్ డార్ట్.. ఫుల్ సక్సెస్

Nasa: ఆపరేషన్ డార్ట్.. ఫుల్ సక్సెస్
Nasa: ఎంత వేగంతో దూసుకొచ్చే శకలాలనైనా సరే.. వాటిని దారి మళ్లించే సత్తా సాధించింది నాసా.

NASA: గ్రహ శకలాలతో ఇక ముప్పేం లేదు. ఎంత వేగంతో దూసుకొచ్చే శకలాలనైనా సరే.. వాటిని దారి మళ్లించే సత్తా సాధించింది నాసా. భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించడమే లక్ష్యంగా ప్రయోగించిన ఆపరేషన్ డార్ట్.. ఫుల్ సక్సెస్ అయింది. 90 లక్షల కిలోమీటర్ల దూరంలో డైమార్ఫస్‌ అనే ఆస్టరాయిడ్‌ను డార్ట్ స్పేస్‌ క్రాఫ్ట్ ఢీకొట్టింది. ఈ ఆపరేషన్‌తో డైమార్ఫస్‌ గ్రహశకలంలో వచ్చిన మార్పుపై కొన్ని నెలల్లో స్పష్టత వస్తుందని నాసా తెలిపింది.

భారీ గ్రహశకలాల కారణంగా ఎప్పటికైనా సరే భూమికి ప్రమాదం తప్పదు. డైనోసార్ వంటి జీవజాతులు గ్రహశకలాల తాకిడికే అంతం అయ్యాయి. ఈసారి అలాంటి పరిస్థితే వస్తే మానవాళి, సమస్త జీవకోటి అంతమైపోతుంది. ఆ ముప్పు నుంచి పూర్తిగా బయటపడేందుకు నాసా కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాన్ని దారి మళ్లించేందుకు పెద్ద ఆపరేషనే చేపట్టింది. భూమికి 90 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలాన్ని స్పేస్‌ క్రాఫ్ట్‌తో ఢీకొట్టించి, దాన్ని దారి మళ్లించింది. ఇకపై ఏదైనా గ్రహశకలం భూమి వైపు వస్తుంటే దాన్ని దారి మళ్లించడం సాధ్యమేననే భరోసా కల్పించింది నాసా.

డార్ట్ స్పేస్‌క్రా‌ఫ్ట్‌ను 10 నెలల క్రితం అంతరిక్షంలోకి పంపింది నాసా. ఈ ప్రయోగం కోసం భూమికి 90 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమార్ఫస్‌ అనే ఆస్టరాయిడ్‌ను ఎంచుకొంది. ఇది డీడైమోస్‌ అనే మరో పెద్ద గ్రహశకలం చుట్టూ తిరుగుతోంది. నాసా ప్రయోగించిన డార్ట్‌.. నిన్న తెల్లవారుఝామున గంటకు 22వేల 500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి డైమార్ఫ్‌స్‌ను ఢీకొట్టింది. ఈ చర్యతో డైమార్ఫస్‌ గమనంలో ఒక్క శాతం తేడా వచ్చినా ఆ ప్రభావం కాలక్రమంలో ఎంతో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం కోసం నాసా 2వేల 650 కోట్లు ఖర్చు చేసింది.

గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి ముందు డార్ట్‌లో ఉన్న ప్రత్యేకమైన కెమెరా.. డైమార్ఫస్‌ను కొన్ని వారాల పాటు చిత్రీకరించింది. ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిన తరువాత డార్ట్‌ ధ్వంసమైంది. డార్ట్‌తో పాటు పంపిన మరో ఉపగ్రహం లిసియాక్యూబ్‌ పంపిన ఫొటోల్లో గ్రహశకలం నుంచి వెలువడ్డ దుమ్ము స్పష్టంగా కనిపించింది. 140 మీటర్లు, అంతకన్నా వెడల్పు ఉండే గ్రహశకలాలు భూమిని ఢీకొడితే ఒక రాష్ట్రం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి గ్రహశకలాలను అంతరిక్షంలో ఉన్నప్పుడే దారి మళ్లించవచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story