Ukraine Russia: ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా..

Ukraine Russia: ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా..
Ukraine Russia: రాజధాని కీవ్, మైకొలేవ్‌, ఖార్ఖివ్, ఖేర్సన్ సహ పలు నగరాలపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది.

Ukraine Russia: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్, మైకొలేవ్‌, ఖార్ఖివ్, ఖేర్సన్ సహ పలు నగరాలపై రష్యా సైన్యం బాంబులతో విరుచుకుపడుతోంది. చెర్నిహైవ్ సిటీ మూడు శక్తివంతమైన దాడులకు పాల్పడింది రష్యా. కీవ్‌లో సరుకు రవాణా విమానాలు తయారు చేసే ఫ్యాక్టరీపైనా దాడి జరిగింది. డొనెట్స్క్‌లో రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అటు డొన్‌బాస్‌లో రెండు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది. ఈ దాడుల్లో వంద మంది రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. మరోవైపు మరియోపోల్‌ నుంచి ఇప్పటివరకూ 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ఇక రష్యా జరిపిన దాడుల్లో ఫాక్స్ న్యూస్‌కు చెందిన కెమెరామెన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

కీవ్‌లో ఓ వెహికిల్‌లో ప్రయాణిస్తుండగా దాడి జరిగినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి ప్రియరీ అని...ఇరాక్, అఫ్గానిస్థాన్, సిరియా యుద్ధాలను కవర్ చేశాడని తెలిపింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకూ 30 లక్షల మంది పొరుగుదేశాలకు వలస వెళ్లినట్లు UNO ప్రకటించింది. ఇక యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 97 మంది చిన్నారులు చనిపోయినట్లు కెనడా పార్లమెంట్‌లో చెప్పారు జెలెన్‌ స్కీ.

కీవ్‌కు అండగా నిలవాలని కెనడాను కోరారు. ఇక ఉక్రెయిన్‌కు భారీ ఆర్థికసాయం ప్రకటించింది అమెరికా 13.6 బిలియన్ డాలర్లు అందించనున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు బిడెన్. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రతీకార చర్యలకు దిగింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, ఇతర అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేసింది. అటు బ్రిటన్ కూడా 370 మంది రష్యా ప్రముఖులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. వీరిలో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్, రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ లాంటి వారున్నారు.

రష్యా కట్టడి విషయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు ఇతర యూరోపియన్ నాయకులతో వర్చువల్‌గా మాట్లాడారు జెలెన్‌ స్కీ. ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌గా అమలు చేసేందుకు నాటో నిరాకరించడంపై జెలెన్‌ స్కీ అంసతృప్తి వ్యక్తం చేశారు. నాటో ప్రపంచంలోనే అత్యంత బలమైన కూటమని...ఈ కూటమిలోని కొందరు రష్యా దూకుడు కారణంగా హిప్నాటైజ్‌కు గురయ్యారంటూ కామెంట్స్ చేశారు.

నో ఫ్లై జోన్‌గా ప్రకటించకపోవడంతో ఉక్రెయిన్‌లోని మిగతా నగరాలపై రష్యా దాడులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ఉందన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా యూరోపియన్‌ హక్కుల సంఘం నుంచి రష్యాను బహిష్కరించాలని ఒత్తిడి వస్తున్న వేళ..తామే వైదొలుగుతామని ప్రకటించింది రష్యా.

ఇక యూరోపియన్ యూనియన్‌కు చెందిన మూడు దేశాల ప్రధానులు ఉక్రెయిన్ చేరుకున్నారు. పోలండ్, చెక్‌ రిపబ్లిక్‌, స్లొవేకియా ప్రధానులు ఇప్పటికే కీవ్ చేరుకున్నారు. యుద్ధం పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో చర్చలు జరపనున్నారు. మరోవైపు ఈ వారంలో రష్యాతో పాటు ఉక్రెయిన్లో పర్యటించనున్నారు టర్కీ విదేశాంగ శాఖ మంత్రి.

Tags

Read MoreRead Less
Next Story