Ukraine: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి దేశం‌ ఉక్రెయిన్‌.. మరి ఇప్పుడు ఎందుకిలా..?

Ukraine: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి దేశం‌ ఉక్రెయిన్‌.. మరి ఇప్పుడు ఎందుకిలా..?
Ukraine: పుట్టుకతోనే ఐదువేల అణ్వాయుధాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి దేశం‌.

Ukraine: పుట్టుకతోనే ఐదువేల అణ్వాయుధాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి దేశం‌. కానీ, ప్రపంచ దేశాల మాటలు నమ్మి.. అణ్వాయుధాలు వదులుకొని.. జాతీయ భద్రతను వారి చేతిలో పెట్టి నిస్సాహయంగా మిగిలిపోయింది. దీనికి తోడు పెరిగిన అవినీతి, పరాయి దేశాలకు తొత్తులుగా ఉన్నవాళ్లు అధికారంలోకి రావడం శాపంగా మారింది. ఫలితంగా దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తోంది.

నాడు ముచ్చట్లు చెప్పిన దేశాలు ఒక్కటీ సాయానికి ముందుకు రావడంలేదు. దీంతో జరిగిన అన్యాయానికి మౌనంగా రోధిస్తోంది ఉక్రెయిన్‌. కోల్డ్‌ వార్‌ ముగిసే సమయానికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనాల కంటే అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశం ఉక్రెయిన్‌. దేశం ఆవిర్భవించే నాటికి రష్యా నుంచి వారసత్వంగా వచ్చిన దాదాపు 5 వేలకు పైగా అణ్వస్త్రాలు దీనికి ఉన్నాయి. దాదాపు 200 అడ్వాన్స్‌డ్ రాకెట్లు, 175 ఖండాంతర క్షిపణులు, SS‌-24 క్షిపణులు కూడా ఉన్నాయి.

ఈ క్షిపణులు ఒక్కోటి 10 థర్మో న్యూక్లియర్‌ అణ్వాయుధాలను ప్రయోగించగలవు. ఉక్రెయిన్ కంటే రష్యా, అమెరికా వద్ద మాత్రమే అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. 33 హెవీ బాంబర్లు కూడా ఉక్రెయిన్‌లో ఉన్నాయి. కొత్త పాలకులు.. దేశానికి విశ్వాసంగా ఉంటామని సైనికులు, కమాండర్లను ప్రతిజ్ఞ చేయమని కోరగా.. కొందరు నిరాకరించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఉక్రెయిన్‌తో అణు నిరాయిధీకరణ చేయించేందుకు బ్రిటన్‌, రష్యా, అమెరికా చర్చలు జరిపాయి. 1994లో ఈ నాలుగు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. దీని ప్రకారం ఉక్రెయిన్‌ అణ్వాయుధాలను నాశనం చేయాలి. దీనికి ప్రతిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి, నాటి సరిహద్దులను గౌరవించాలి. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఈ దేశాలు ఎటువంటి సైనిక శక్తిని ప్రయోగించకూడదు.

ఒప్పందం ప్రకారం 1996 నాటికి చిట్టచివరి అణ్వాయుధాన్ని కూడా ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించింది. ఈ ఒప్పందాన్ని దౌత్యవేత్తలు గొప్ప విజయంగా చెప్పుకొంటారు. బోరిస్‌ ఎల్సిన్‌ తర్వాత రష్యాలో పుతిన్‌ అధికారం చేపట్టారు. నాటి నుంచి మెల్లగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. రష్యా విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది.

మరోపక్క ఉక్రెయిన్‌లో రాజకీయాలను ప్రభావితం చేసిన కీలుబొమ్మ ప్రభుత్వాలను అధికారంలోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఒక దశలో రష్యా వ్యతిరేక అభ్యర్థి విక్టర్ యష్చంకోపై విషప్రయోగం చేశారు. కానీ, అదృష్టం కొద్దీ ఆయన బతికి బట్టకట్టి అధికారం చేపట్టారు. కానీ, 2010లో రష్యా కీలుబొమ్మగా పేరుగాంచిన విక్టర్‌ యాన్కోవిచ్‌ అధికారం చేపట్టారు. దీంతో మెల్లగా రష్యా పట్టు పెరిగిపోయింది.

యాన్కోవిచ్‌కు వ్యతిరేకంగా మైదన్‌ స్క్వేర్‌ ఆందోళన చోటు చేసుకొంది. దీంతో యాన్కోవిచ్‌ రష్యాకు పారిపోయారు. దీంతో పట్టు కోల్పోతామని భావించిన పుతిన్‌ క్రిమియాను ఆక్రమించడంతో పాటు తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్‌ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని ఎగదోశారు. అప్పుడు కూడా అమెరికా, బ్రిటన్‌లు రష్యాపై ఆంక్షలు విధించి చేతులు దులుపుకొన్నాయి సైన్యాలను పంపి అండగా నిలవలేదు.

నాటోలో భాగస్వామ్యం కావాలంటూ కొన్నేళ్లుగా ఉక్రెయిన్‌ నెత్తీనోరు బాదుకుంటున్నా.. అమెరికా సహకరించలేదు. ఉక్రెయిన్‌ నాటో సభ్యత్వాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఫ్రాన్స్‌, జర్మనీలను వారించలేదు. తాజాగా పుతిన్‌ యుద్ధసన్నాహాలు చేస్తున్న సమయంలో తమ దళాలు ఉక్రెయిన్‌లో పోరాడవని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ముందుగానే ప్రకటించారు.

ఇది రష్యా ధైర్యాన్ని మరింత పెంచింది. నాటో సభ్యదేశం, ఐరోపా ఆర్థిక శక్తి అయిన జర్మనీ ఉక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని హెల్మెట్లతో పాటు వైద్యసాయం అందిస్తామని ప్రకటించి చేతులు దులుపుకొంది. జర్మనీ ఆయుధాలను ఉక్రెయిన్‌ ఇవ్వొద్దని బాల్టిక్‌ దేశాలను అడ్డుకొంది. చివరికి తమ ప్రాణాలు కాపాడేందుకు ఎవరూ రారని ఉక్రెయిన్‌ వాసులకు అర్థమైంది.

ఆత్మరక్షణ కోసం వృద్ధులతో సహా చాలా మంది తక్షణమే సైనిక శిక్షణ పొందడం మొదలుపెట్టారు. 2014 క్రిమియా ఆక్రమణలో లోపాలను సరిచేసుకొని పుతిన్‌ తాజాగా మరోసారి ఉక్రెయిన్‌పై దండెత్తారు. అత్యంత బలీయశక్తి అయిన రష్యాపై ఉక్రెయిన్‌ నిస్సహాయంగా పోరాడుతోంది. ప్రపంచ దేశాల మాటలు నమ్మి ఆయుధాలను వదిలినందుకు ఉక్రెయిన్‌ పశ్చాత్తాపపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story