పది పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ పరీక్షలు వాయిదా

పది పబ్లిక్ పరీక్షలు రద్దు.. ఇంటర్ పరీక్షలు వాయిదా
గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభణతో విద్యాసంస్థలు మూత పడ్డాయి. పబ్లిక్ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి.

గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభణతో విద్యాసంస్థలు మూత పడ్డాయి. పబ్లిక్ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. స్కూళ్లు మూతపడినా ఆన్‌లైన్ పాఠాలతో ఈ ఏడాది అయినా పరీక్షలు రాద్దామనుకుంటే మునుపటి కంటే మరింత ఎక్కువగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో మళ్లీ ఈ ఏడాది కూడా పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే రెండో ఏడాదికి ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. రెండో ఏడాది పరీక్షలను మాత్రం వాయిదా వేశారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గురువారం ఉదయం ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే పది పరీక్షల రద్దు విషయాన్ని ప్రకటించారు.

రాష్ట్రం నుంచి మొత్తం 5.21 లక్షల మంది విద్యార్థుల రిజల్ట్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం నిర్ణయించే విధానంలో వచ్చిన గ్రేడ్లపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నట్లయితే భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని వాటికి హాజరుకావచ్చని పేర్కొన్నారు.

పది గ్రేడింగ్‌కు ఎఫ్‌ఏ-1 కీలకమైనది. ఫార్మాటివ్ అసెస్‌మెంట్-1 ఇప్పటికే పూర్తయినందున వాటి ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో సబ్జెక్టు 20 మార్కులుంటాయి. వీటిలో 20కి 18 మార్కులు వస్తే 100కి 90 గా లెక్కించి గ్రేడ్‌లు ఇవ్వాలనుకుంటున్నారు.

ఇంటర్ పరీక్షల విషయానికి వస్తే..

మొదటి ఏడాది పరీక్షలు లేకుండా రెండో ఏడాదికి ప్రమోట్ చేస్తారు. ఇక రెండో ఏడాది పరీక్షలను కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జూన్ మొదటి వారంలో సమీక్షించి 15 రోజులు ముందుగా పరీక్ష తేదీలను ప్రకటిస్తారు.

మొదటి సంవత్సరంలోని సబ్జెక్టులు ఏమైనా బ్యాక్‌లాగ్‌లు ఉంటే వాటికి కనీస మార్కులు ఇచ్చి పాస్ చేస్తారు. ఇలాంటి వారు 1,99,019 మంది ఉన్నారు.

ఇక ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండేది. అయితే ఈసారికి ఆ వెయిటేజీ ఉండదు. ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకు నిర్ణయిస్తారు.

ఇదిలా ఉంటే ప్రాక్టికల్ పరీక్షలను మే 29వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇటీవల ఇంటర్ బోర్డు ప్రకటించింది. తాజాగా రెండో ఏడాది వార్షిక పరీక్షలను వాయిదా వేయడంతో మే 29 నుంచి అయినా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్నది అనుమానమే. దీనిపై ఇంటర్ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Tags

Read MoreRead Less
Next Story