స్కూల్ పిల్లల పొట్టకొడుతున్న అధికార పార్టీ నేతలు

స్కూల్ పిల్లల పొట్టకొడుతున్న అధికార పార్టీ నేతలు

వర్గపోరులేని రాజకీయాలుండవు. అది నేతలు, కార్యకర్తల వరకు అయితే పర్వాలేదు. కానీ TRSలో రెండు వర్గాల ఆధిపత్యపోరు స్కూలు పిల్లల పొట్టగొడుతోంది. వేల మంది పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందకుండా చేస్తోంది. రాజకీయాలకు, పిల్లల భోజనాలకు ఉన్న లింక్‌ ఏమిటంటే..

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ స్కూలు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, ఇస్కాన్‌ అక్షయపాత్రతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డ సహకారంతో మధ్యాహ్న భోజన నిధులకు మరిన్ని నిధులు జోడించారు. దీనికోసం అధునాతన కిచెన్‌ ఏర్పాటు చేశారు. ముందుగా కొత్తగూడెంలో ప్రారంభించి తర్వాత అన్ని స్కూళ్లకు పౌష్టికాహారం అందించాలన్నది టార్గెట్. అక్షయపాత్ర ప్రారంభ కార్యక్రమంలో ఇస్కాన్‌ ప్రతినిధులు, జలగం వెంకట్రావ్, శోభుయార్లగడ్డ పాల్గొన్నారు...

కిచెన్‌ ప్రారంభించాక కొత్తగూడెంలోని వందలాది విద్యార్థులకు ప్రతి రోజు పౌష్టికాహారాన్ని అందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన జలగం ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరావు గెలిచారు. ఆ తర్వాత వనమా కూడా టిఆర్‌ఎస్‌లో చేరారు. రెండు వర్గాలు TRSలో ఉండటంతో ఆ ప్రభావం అక్షయపాత్రపై పడింది. ఇద్దరు నేతల మధ్య వర్గపోరు ఎక్కువైంది. భోజనంలో పురుగులు వస్తున్నాయని వనమా వర్గం ఫిర్యాదు చేయడంతో అక్షయపాత్ర పథకం నిలిచిపోయింది. అలా పౌష్టికాహారం పొందే అవకాశాన్ని వేల మంది విద్యార్థులు కోల్పోయారు.

సదుద్దేశంతో ప్రారంభించిన పథకం మధ్యలో ఆగిపోవడంపై జలగం కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దగ్గరే తేల్చుకుంటామంటున్నారు. శుచి, శుభ్రతకు మారుపేరుగా ఉండే అక్షయపాత్రపై ఆరోపణలు చేయడాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. తమ స్వార్ధ రాజకీయాల కోసం విద్యార్థులను బలిచేయొద్దని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story