Nayeem Diaries Movie Review: నేర చ‌రిత్రలో 'న‌యీం' ఒక ప్రత్యేక అధ్యాయం.. అది 'నయీం డైరీస్‌' లో స్పష్టం..

Nayeem Diaries Movie Review: నేర చ‌రిత్రలో న‌యీం ఒక ప్రత్యేక అధ్యాయం.. అది నయీం డైరీస్‌ లో స్పష్టం..
Nayeem Diaries : గ్యాంగ్‌స్టర్ జీవితాల‌లో న‌యీం జీవితం చాలా ప్రత్యేకం. రెండు వైరుధ్యమైన పాత్రలలో హీరోగా ఎదిగిన న‌యీం లాంటి వ్యక్తి నేర ప్రపంచంలో క‌న‌ప‌డ‌డు.

Nayeem Diaries Movie Review: నేర చ‌రిత్రలో న‌యీం ఒక నెత్తుటి అధ్యాయం.. ఆ నేర చ‌రిత్ర చుట్టూ జ‌రిగిన క‌థ ఏంటో న‌యీం డైరీస్ లో చూపించేందుకు ద‌ర్శకుడు దాము బాలాజీ చేసిన ప్రయత్నమే న‌యీం డైరీస్. కెజియ‌ఫ్ , నార‌ప్ప వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా ద‌గ్గరైన వ‌శిష్ట సింహా ప్రధాన పాత్రలో న‌టించిన న‌యీం డైరీస్ విడుద‌ల‌కు ముందే వివాదాల‌ను త‌ట్టి లేపింది. మ‌రి ఈ రోజు రిలీజ్ అయిన న‌యీం డైరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం...

కథః

న‌యీం జీవితం భువ‌న‌గిరిలో ఒక సాధార‌ణ కుటుంబం నుండి మొద‌ల‌వుతుంది. న‌యీం చిన్నతనం.. అత‌నికి కుటుంబం ప‌ట్ల ఉండే బాధ్యత‌.. ఏదైనా స‌రే గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల ఇవ‌న్నీ సినిమాలో క‌నిపిస్తాయి. అక్క (యజ్ఞా శెట్టి) ని ఎవ‌రు ఏమ‌న్నా వారిని వ‌దిలిపెట్టడు. అత‌ని ధైర్య సాహాసాలు చూసి న‌క్సలిజంలోకి తీసుకెళ్తారు. అక్కడ ఎదిగిన న‌యీం ఒక ఐజీ హత్యో కీల‌క పాత్రను పోషించి హీరో అవుతాడు. జైల్లో న‌క్సల్స్ ట్రైన‌ర్ గా మార‌తాడు. జైలు అత‌ణ్ని మ‌రో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

అయితే జైల్లో న‌క్సలిజంలోని ద్వంద నీతి న‌యీంని ఎదురుతిరిగేలా చేస్తుంది. అక్కపై చేయి వేసిన మాజీ న‌క్సల్‌ని చంప‌డంతో న‌యీం జీవితం మారిపోతుంది. అతన్ని నయీం తమ్ముడు చంపేయడం, ఆ తర్వాత నక్సల్స్ పై అసహ్యం కల్గడం, దాన్ని ఆసరగా తీసుకుని పోలీసులు నయీంని తనకు కోవర్ట్ గా మార్చుకుని నక్సల్స్ ని మట్టు పెట్టడం చేస్తుంటాడు.. అలా న‌యీం పోలీస్ శాఖలో ప‌వ‌ర్ పుల్ ప‌ర్సన్‌గా ఎదుగుతాడు. అక్కడి నుండి అత‌ని జీవితం ఎలాంటి మ‌లుపులు తీసుకుంది.. న‌యీం క‌థ ముగియ‌డానికి కార‌ణం ఎవ‌రు ..? అనేది మిగిలిన క‌థ‌..?

విశ్లేష‌ణః

ఏ గ్యాంగ్‌స్టర్ క‌థ‌లో అయినా భిన్న కోణాలుంటాయి.. అయితే వాటిని ఆవిష్కరించే తీరులో ఆ క్రిమిన‌ల్ ప్రేక్షకుల‌కు ఎక్కువ కాలం గుర్తుంటాడు. ద‌ర్శకుడు దాము బాలాజీ ఈ విష‌యంలో ఎక్కడా రాజీ ప‌డ‌లేదు.. బెద‌ర‌లేదు.. తాను తెల్సుకున్న నిజాల‌ను చెప్పడానికి ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. దీంతో న‌యీం డైరీస్ చూసిన ప్రేక్షకుల‌కు ఇంత‌కు ముందు న‌యీంపై ఉన్న కోపం పోదు కానీ కాస్త త‌గ్గుతుంది అన‌డంలో సందేహాం లేదు.

ఏ గ్యాంగ్‌స్టర్ జీవితం అయినా ప్రభావితం చేసే వ్యక్తులు సమాజంలోనే ఉంటారు. కానీ రెండు విరుద్ధమైన వ్యవస్థలలో హీరో గా ఎదిగిన న‌యీం జీవితం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. అయితే పోలీస్ లు ముల్లుని ముల్లుతోనే తీయాల‌నే సూత్రంని పాటించిన న‌యీం సంఘ విద్రోహ శ‌క్తిగా మారేందుకు కూడా స‌హాక‌రించారు అని దాము ధైర్యంగా చెప్పాడు.

తాను మాజీ న‌క్సలైట్ అయినా కూడా ఏ వ్యవస్థ ప‌ట్లా ప్రత్యేక ప్రేమ‌ను చూపించ‌లేదు. బెల్లీ ల‌లిత ప్రజా గాయ‌ని ఎపిసోడ్ ని కూడా తాను సేక‌రించిన స‌మాచారం మేర‌కు ధైర్యం గా చూపించాడు. అదే ఇప్పుడు వివాదాల‌కు తావు ఇచ్చింది. న‌యీం డైరీస్ సినిమా చూస్తుంటే ఒక క్రిమిన‌ల్ త‌యార‌య్యాడు అంటే అత‌ను ఎదురైన ప‌రిస్థితుల ప‌ట్ల అత‌ను తీసుకున్న నిర్ణయాలే .. కానీ న‌యీం క్రిమిన‌ల్ అందులో సందేహంలేదు.. కానీ అత‌ను మాత్రమే కాదు అని న‌యీం డైరీస్ చూస్తే అర్దం అవుతుంది.

మావోయిస్టు అగ్రనేతలు వీరన్న, రవన్న, సోమన్న, మోహన్‌రెడ్డి, సాగరన్న, గణేష్‌, సాంబా శివుడి పాత్రలను, వారితో నయీంకి ఉన్న అనుబంధాన్ని, ఆ తర్వాత ద్వేషాన్ని, ఆ తర్వాత వారిని పక్కా స్కెచ్‌తో ఎన్‌కౌంటర్‌ చేయడం చూపించారు. మావోయిస్టులపై ఉన్న ద్వేషాన్ని క్యాష్‌ చేసుకుని పోలీసులు నయీంని తమకి కోవర్ట్ గా మలుచుకుని అడవుల్లో మావోలను మట్టు పెట్టడం, ఆ తర్వాత నయీంకి స్వేచ్చ ఇచ్చి వ్యాపారాలు చేయించడం, దందాలు, కబ్జాలు, దోచుకోవడాలు, సెటిల్మెంట్లు ఇలా అన్నింటిని టచ్‌ చేశారు దర్శకుడు.

నయీం మాజీ నక్సలైట్‌ నుంచి రౌడీషీటర్‌గా, గ్యాంగ్‌స్టర్ గా ఎదగడానికి దోహదపడిన అంశాలను బోల్డ్ గా ఆవిష్కరించారు. అందుకు ఆయనకు పోలీస్‌ డిపార్ట్ మెంట్‌ ఏ రేంజ్‌లో అండగా నిలిచింది. ఆయన్ని అడ్డు పెట్టుకుని దాదాపు 20కిపైగా ఐపీఎస్‌, ఐఎఎస్‌ స్థాయి అధికారులు కోట్లకు కోట్లు సంపాదించడం, ఆయన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకుల సెటిల్మెంట్లని ఇందులో నిజాయితీగా చూపించారు. వ‌శిష్ఠ సింహం త‌న పాత్రకు వంద‌శాతం న్యాయం చేశాడు.

అత‌ని వాయిస్ అప్పీరియ‌న్స్‌తో న‌యీం క్యారెక్టర్‌కి ఇమేజ్‌ని పెంచాడు. న‌యీం పాత్రలోని భావోద్వేగాల‌ను చాలా బాగా ప‌లికించాడు. దివి ఉన్నంతలో చాలా గ్లామ‌ర్ గా క‌నిపించింది. ప్రతి పాత్రను దర్శకుడు చాలా రియ‌లిస్టిటిక్‌గా మ‌లిచాడు. గ్యాంగ్‌స్టర్ జీవితాల‌లో న‌యీం జీవితం చాలా ప్రత్యేకం. రెండు వైరుధ్యమైన పాత్రలలో హీరోగా ఎదిగిన న‌యీం లాంటి వ్యక్తి నేర ప్రపంచంలో క‌న‌ప‌డ‌డు. న‌యీం డైరీస్ లాంటి బోల్డ్ అంటెంప్ట్ కూడా ఊహించ‌లేము.

చివ‌రిగాః

నేర చ‌రిత్రలో న‌యీం ఒక ప్రత్యేక అధ్యాయం.. న‌యీం డైరీస్ కూడా గ్యాంగ్‌స్టర్ జీవితాల పై తీసిన సినిమాల‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. నిజానిజాల‌తో పాటు అనుక్షణం ఉత్కంఠ భ‌రితంగా సాగిన న‌యీం డైరీస్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి త‌ప్పకుండా న‌చ్చుతుంది.

Tags

Read MoreRead Less
Next Story