రెండేళ్ల చిన్నారికి విమానంలో ఆగిన శ్వాస.. ప్లైట్ లో ఉన్న ఎయిమ్స్ డాక్టర్లు..

రెండేళ్ల చిన్నారికి విమానంలో ఆగిన శ్వాస.. ప్లైట్ లో ఉన్న ఎయిమ్స్ డాక్టర్లు..
బెంగళూరు నుంచి ఢిల్లీ వెళుతున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోయింది.

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళుతున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోయింది. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు. అదృష్టం కొద్దీ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు వైద్యులు విమానంలో ఉన్నారు. పాపకు అత్యవసర చికిత్స అందించారు.

ఆదివారం బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళుతున్న విస్తారా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ఉన్న ఐదుగురు వైద్యులు కాల్‌కు స్పందించి పసిబిడ్డ ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనను AIIMS ఢిల్లీ ధృవీకరించింది. ఈ విషయాన్ని AIIMS సిబ్బంది ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ విమానంలో ఉన్న చిన్నారి చిత్రాలను పంచుకుంది.

ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కాన్ఫరెన్స్ నుండి AIIMS వైద్యుల బృందం తిరిగి వస్తున్నారు. ఐదుగురిలో ఒక అనస్థీషియా డాక్టర్ కాగా మిగిలిన వారు కార్డియాక్ రేడియాలజిస్టులు.

చిన్నారి పుట్టుకతోనే గుండె సమస్యతో బాధపడుతోంది. పాపకు శ్వాస అందకపోవడం వల్ల చర్మం అంతా ఉదా రంగులోకి మారిపోయింది. వైద్యుల బృందం వెంటనే చికిత్స ప్రారంభించింది.

రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్ (ROSC) ద్వారా చిన్నారి గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. అయినా పాప కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించినప్పటికీ చిన్నారిని రక్షించేందుకు వైద్యుల బృందం 45 నిమిషాల పాటు శ్రమిస్తూనే ఉంది. వారు ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED)ని ఉపయోగించారు. ఇది సాధారణంగా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌ను ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి ఉపయోగించే పరికరం.

దాదాపు 45 నిమిషాల పాటు, శిశువుకు చికిత్స అందించారు. విమానాన్ని నాగ్‌పూర్‌కు తరలించి అక్కడి పిల్లల వైద్యులకు చూపించారు. ఆమె రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకుంది. పాప ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. ఎయిమ్స్‌కు చెందిన వైద్య బృందం చేసిన ప్రయత్నం ఫలించింది. 2 ఏళ్ల పాపకు రెండో జీవితాన్ని అందించింది.

Tags

Read MoreRead Less
Next Story