ట్రాఫిక్ కి చెక్.. రంగంలోకి దిగిన 200 మంది మహిళా పోలీసులు

ట్రాఫిక్ కి చెక్.. రంగంలోకి దిగిన 200 మంది మహిళా పోలీసులు
ఇండోర్, మధ్యప్రదేశ్‌లోని అత్యధిక జనాభా కలిగిన నగరం. రాష్ట్రంలోనే అత్యధిక వాహనాల సాంద్రతను కలిగి ఉంది.

ఇండోర్, మధ్యప్రదేశ్‌లోని అత్యధిక జనాభా కలిగిన నగరం. రాష్ట్రంలోనే అత్యధిక వాహనాల సాంద్రతను కలిగి ఉంది. ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం 200 మంది మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు నియమించింది.

ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పురుష పోలీసు సిబ్బంది మాత్రమే ట్రాఫిక్‌ను నిర్వహించగలరనే భావన మారాలని మహిళా కానిస్టేబుల్ ఒకరు ఉద్ఘాటించారు.

రద్దీగా ఉండే రీగల్ కూడలిలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్న కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ, "ఇండోర్ ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో పరిశుభ్రత వలె దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము." అని అన్నారు.

"కొన్నిసార్లు రైడర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, మహిళా కానిస్టేబుళ్లతో వాదిస్తారు. అయితే మేము అలాంటి వారితో కూడా ఎలా డీల్ చేయాలో శిక్షణలో తెలుసుకున్నాము.. కావునా మేము వారితో స్మూత్ గా వ్యవహరించగలుగుతున్నాము" అని ఆమె చెప్పారు.

ట్రాఫిక్‌ను హ్యాండిల్ చేయడంలో శిక్షణ పొందిన మరో కానిస్టేబుల్ సోనాలి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు కాలం మారింది.. మగ పోలీసులే ట్రాఫిక్‌ను నియంత్రించగలరనే ఆలోచనలో ప్రజల్లో మార్పు రావాలి.. పోలీసు శాఖలో స్త్రీ, పురుషులకు ఒకే రకమైన శిక్షణ ఇస్తున్నారు. " అని ఆమె పేర్కొన్నారు.

100 శాతం అంకితభావంతో పనిచేయాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడాలని సోనీ తన నిబద్ధతను వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లు తమ విధులను నిర్వర్తించడంలో ప్రదర్శిస్తున్న అంకితభావం చూసి పురుష ట్రాఫిక్ పోలీసులు అచ్చెరువొందుతున్నారు. మహిళా ట్రాఫిక్ సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.

ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రఘువీర్ సింగ్ మీనా మాట్లాడుతూ.. మహిళా కానిస్టేబుళ్లు ట్రాఫిక్‌ను చక్కగా నిర్వహిస్తున్నారని, మగ సహోద్యోగులతో కలిసి పని చేస్తున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story