సీఎం ప్రసంగిస్తున్న వేదికపైకి తన ఏడాది చిన్నారిని విసిరిన తండ్రి

సీఎం ప్రసంగిస్తున్న వేదికపైకి తన ఏడాది చిన్నారిని విసిరిన తండ్రి
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వేదికపై ఓ వ్యక్తి తన ఏడాది వయసున్న బిడ్డను విసిరాడు. కారణం తెలిస్తే కళ్లు చెమరుస్తాయి.

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వేదికపై ఓ వ్యక్తి తన ఏడాది వయసున్న బిడ్డను విసిరాడు. కారణం తెలిస్తే కళ్లు చెమరుస్తాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, గుండెకు రంధ్రం ఉన్న తన ఏడాది వయసున్న చిన్నారిని రక్షించాలనే తపనతో ఓ వ్యక్తి తన బిడ్డను డయాస్‌పైకి విసిరేశాడు. నిస్సహాయ తండ్రి చేసిన పనికి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందేమో అని అంతటి సాహసానికి పాల్పడ్డాడు.

వృత్తిరీత్యా కూలీ అయిన ముఖేష్ పటేల్ తన కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో పటేల్ చర్య తీవ్ర సంచలనం కలిగించింది. సీఎం చౌహాన్ దృష్టిని కూడా ఆకర్షించింది. జనం గుంపుల మధ్య ఒక సంవత్సరపు పిల్లాడు వేదికకు ఒక అడుగు దూరంలో పడిపోయాడు. ఘటనాస్థలిలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆ చిన్నారిని తల్లికి అప్పగించారు.

సీఎం చౌహాన్ పటేల్ ను పిలిచి అధికారులతో మాట్లాడించారు. తన కుమారుడికి గుండెలో రంధ్రం ఉందని, అతనికి చికిత్స చేయించేందుకు చాలా డబ్బు ఖర్చవుతోందని చెప్పాడు. అంత స్థోమత తనకు లేదని సీఎంకు వివరించాడు. ఆ సందేశం సీఎం వద్దకు చేరగా, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఫిర్యాదుదారుడి కేసును సీఎం సభకు పంపాలని కలెక్టర్ దీపక్ ఆర్యను సీఎం చౌహాన్ ఆదేశించారు. ముఖేష్ పటేల్ సాగర్‌లోని కేస్లీ తహసీల్‌లోని సహజ్‌పూర్ గ్రామ నివాసి. అతను తన భార్య నేహా, వారి ఒక సంవత్సరం కొడుకుతో నివసిస్తున్నాడు. మీడియాతో ముఖేష్ మాట్లాడుతూ, తన కుమారుడికి 3 నెలల వయస్సు ఉన్నప్పుడే వైద్యులు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. అంత స్థోమత లేకపోయినా ఇప్పటి వరకు తన కుమారుడి వైద్యం కోసం రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

"మా బిడ్డకు ఇప్పుడు ఏడాది వయస్సు. డాక్టర్ సర్జరీ చేయించాలని చెప్పారు. రూ. 3.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఇంత పెద్ద మొత్తం మా దగ్గర లేదు. మా బిడ్డకు వైద్యం చేయించాలని కోరుతున్నాం. కానీ ఎవరూ మాకు సహాయం చేయడం లేదు ”అని ముఖేష్ అన్నారు. సిఎం నిధి నుండి కొంత సహాయం అందితే మా బిడ్డను బ్రతికించుకుంటాం అని కన్నీళ్లతో అధికారులను ప్రాధేయపడ్డాడు.

అయితే ముఖ్యమంత్రిని కలవడానికి కూడా మాకు అనుమతి ఇవ్వలేదు.. ఆయన వద్దకు వెళ్లేందుకు పోలీసులు కూడా మాకు సహాయం చేయడం లేదు. నా బాధను వారికి వినిపించడానికే గుండె రాయి చేసుకుని నా బిడ్డను వేదికపైకి విసిరేశాను.. ఇప్పుడు అధికారులు ఆ విషయంపై దృష్టి సారించారు. రేపు సీఎంను కలిసేందుకు రమ్మని అడిగారు'' అని ముఖేష్‌ తెలిపారు.

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన ఒక రోజు తర్వాత, రాష్ట్రంలోని కుషావాహ, జాట్ వర్గాల సమావేశంలో చౌహాన్ ప్రసంగించారు.

Tags

Read MoreRead Less
Next Story