అప్పు చేసి ఎన్నికల్లో గెలిచి.. మట్టి ఇంట్లో నివసిస్తున్న పేద ఎమ్ఎల్ఏ

అప్పు చేసి ఎన్నికల్లో గెలిచి.. మట్టి ఇంట్లో నివసిస్తున్న పేద ఎమ్ఎల్ఏ
ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే నమ్మశక్యం కాదు.. రాజకీయాల్లోకి రావాలంటేనే బాగా డబ్బులుండాలి. కోట్లిచ్చిన వాళ్లకే టికెట్ లభిస్తుంది.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే నమ్మశక్యం కాదు.. రాజకీయాల్లోకి రావాలంటేనే బాగా డబ్బులుండాలి. కోట్లిచ్చిన వాళ్లకే టికెట్ లభిస్తుంది. ఇక అధికారంలోకి వచ్చాక చెప్పేదేముంది. అందినకాడికి దండుకోవడం, మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు అడ్రస్ లేకుండా పోవడం. ఇదీ రాజకీయ నాయకుల తంతు.. సొంత నియోజక వర్గ ప్రజలకు కొంత చేయాలన ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా కనిపించదు.

రాజకీయ నాయకులు అవినీతిపరులు అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. వారు సంపదను పోగుచేసి ధనవంతులవుతారు. కానీ మధ్యప్రదేశ్ నుండి కొత్తగా ఎన్నికైన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే ఇలాంటి వారికి మినహాయింపు. ఓ సాధారణ వ్యక్తి కమలేశ్వర్ దొడియార్. మంచి ఇల్లు కూడా లేదు.. మట్టి ఇంట్లో ఉంటూ, తన నియోజకవర్గం నుండి అసెంబ్లీకి మోటర్‌బైక్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఇది అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గ ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు అద్దం పడుతుంది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న జరిగిన ఎన్నికల్లో రత్లాం జిల్లాలోని సైలానా నియోజకవర్గం నుంచి ఆయన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే దొడియార్ ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పడు రోజువారీ కూలీగా పనిచేస్తుంటారు. గురువారం ఆయన అసెంబ్లీ ప్రవేశ ద్వారం ముందు సాష్టాంగ పడి ప్రజాస్వామ్య దేవాలయానికి నివాళులర్పించి అనంతరం అధికారుల ముందు ఎమ్మెల్యేగా తన ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు.

సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్ష్‌ విజయ్‌ గెహ్లాట్‌పై 4,618 ఓట్ల తేడాతో విజయం సాధించిన దోడియార్‌ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. దొడియార్ 2018లో మొదటిసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరుసటి సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.

230 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 163 సీట్లు, కాంగ్రెస్ 66 సీట్లు గెలుచుకోగా, మిగిలిన ఒక సీటును బీఏపీ గెలుచుకుంది. అతడు ఎన్నికల ప్రచారం కోసం క్రౌడ్ ఫండింగ్ మరియు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకున్నారు. గిరిజన తండాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వారి జీవన విధానంలో మెరుగైన మార్పులు తీసుకురావాలన్నది అతడి లక్ష్యం. అదే అతడికి ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టింది.

తొమ్మిది మంది తోబుట్టువులలో చిన్నవాడు దొడియార్. సైలానా పంచాయితీలోని రాధగువా గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి గడ్డితో కప్పబడిన మట్టి ఇంట్లో నివసిస్తున్నాడు. అతడి 62 ఏళ్ల తల్లి సేతా బాయి, వికలాంగుడైన తన భర్త ఓంకార్‌లాల్ దోడియార్ (70)ని చూసుకోవడానికి రోజువారీ కూలీగా పని చేస్తుంది. అతని ఐదుగురు సోదరులు పొరుగున ఉన్న రాజస్థాన్‌లో కార్మికులుగా పనిచేస్తుండగా, అతని ముగ్గురు వివాహిత సోదరీమణులు కూడా వారి కుటుంబాలను పోషించడానికి కార్మికులుగా పనిచేస్తున్నారు.

LLB చదివేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడు రోజువారీ కూలీగా, టిఫిన్ డెలివరీ బాయ్‌గా పనిచేసి చదువు పూర్తి చేశాడు. అతని పేరు మీద 16 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి, 11 సార్లు జైలుకు వెళ్లాడు. గిరిజనుల డిమాండ్‌లకు మద్దతుగా నిరసనలు, రోడ్లను దిగ్బంధించినందుకు బహిష్కరణ నోటీసును ఎదుర్కొన్నాడు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను తాను ఆదర్శంగా తీసుకుంటానని కమలేశ్వర్ దొడియార్‌ చెప్పారు. తన ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి మంత్రి కావాలని కలలుకంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story