Aditya L1: నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది

Aditya L1: నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది
నాలుగు నెలలు, 15 లక్షల కిలోమీటర్లు, 1400 పైగా ఫోటోలు

ఆదిత్య L1తో కూడిన పీఎస్ఎల్వీ సీ57 నింగిలోకి దూసుకెళ్లింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య మిషన్ ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు. ఆదిత్య ఎల్ 1 నౌక విజయవంతంగా సూర్యుని దిశగా తన ప్రయాణం మొదలు పెట్టింది. చంద్రయాన్‌-3 సక్సెస్ తో దూకుడుమీదున్న ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా మొదలు పెట్టింది. ఈ శాటిలైట్‌ను ఇస్రో భూమికి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజియన్‌ పాయింట్‌ -1 కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుంది.


ఆదిత్య ఎల్‌-1 సూర్యుడి కరోనా నిర్మాణం, సౌర విస్ఫోటనాలు, సౌర తుఫానులకు కారణాలతో పాటు మూలాలు, కరోనా, కరోనల్‌ లూప్‌ ప్లాస్మా నిర్మాణంతో పాటు సాంద్రత, లక్షణాలతో పాటు పలు అంశాలపై పరిశోధనలు జరుపనున్నది. ఇందులో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుడిపై అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు ఎల్‌-1 పరిధిలోని వాతావరణంపై అధ్యయనం చేస్తాయి.

అయితే ఇతర దేశాలు సూర్యుడి పై తమ అధ్యాయనాలను ఎప్పుడో ప్రారంభించాయి. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆగస్ట్‌ 2018లో తన తొలి పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ను పంపింది. 2020లో నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీతో కలిసి మారుతున్న అంతరిక్ష వాతావరణంపై అన్వేషించేందుకు సోలార్‌ ఆర్బిటర్‌ను కూడా ప్రారంభించింది. జపాన్‌కు చెందిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జక్సా) 1981లో తొలి సౌర పరిశీలన ఉపగ్రహం హినోటోరి మిషన్‌ను ప్రారంభించింది. హార్డ్ ఎక్స్-కిరణాలను ఉపయోగించి సోలా‌ర్‌ ఫ్లేమ్స్‌పై అధ్యయనం చేయడం దీని లక్ష్యం. చివరిసారి 2006లో హీనోడ్ పేరుతో సోలార్ అబ్జర్వేటరీ ని ప్రయోగించింది. ఇక యూరప్‌ కయూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ద్వారా 1990లో సూర్యుడి ఎగువన, దిగువన ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి యులిసెస్‌ మిషన్‌ను మొదలు పెట్టింది. అలాగే చైనా కూడా 2022లో అడ్వాన్స్‌డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీని ప్రారంభించింది. ఇది మాత్రమే సూర్యుడి పై చేసిన తాజా పరిశీలన.


ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా ఇప్పటి వరకూ సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న అమెరికా, యూరోపియన్, జపాన్, జర్మనీ, చైనా దేశాల సరసన భారత్ నిలువన్నది. అయితే ఈ ప్రయోగాలు చేపట్టిన అన్ని దేశాలకు భిన్నంగా ఇస్రో ఎల్‌-1 పాయింట్‌లో శాటిలైట్‌ను ఉంచబోతున్నది. అది కూడా ఎప్పటిలాగే అతి తక్కువ ఖర్చుతో.

Tags

Read MoreRead Less
Next Story