MAHARASTRA: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం

MAHARASTRA: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు... ఎన్డీఏలో చేరిన ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌.... ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం... మంత్రులుగా ప్రమాణం చేసిన తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు సంభవించాయి. అనుమానాలను నిజం చేస్తూ ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్ ఎన్డీఏలో చేరారు. కొద్దికాలంగా శరద్‌ పవార్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న అజిత్‌ పవార్‌ తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ఉండగా ఇప్పుడు రెండో డిప్యూటీ సీఎంగా పవార్‌ ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణం చేయడం ఇది అయిదోసారి కావడం గమనార్హం. ఈ వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సీఎం ఏక్‌నాథ్‌ శిందేలతో అజిత్‌ పవార్‌ సమావేశమయ్యారు. అప్పటినుంచే స్తబ్దుగా ఉన్న అజిత్‌ పవార్‌ అకస్మాత్తుగా NDAలో చేరడం కలకలం సృష్టించింది. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా అజిత్‌ పవార్‌కు 29 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ హాజరయ్యారు. మరో తొమ్మిదిమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం చేసిన వారిలో దిలీప్‌ వాల్సే పాటిల్‌...ఛగన్‌ భజ్‌భుల్‌, ధనుంజయ్‌ ముండే ఉన్నారు.


రాజ్ భవన్ కు వెళ్లేముందు పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఈ భేటీపై తనకు సమాచారం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొనడం గమనార్హం. ఈ భేటీకి శరద్‌పవార్ కుమార్తె, NCP కార్య నిర్వహక అధ్యక్షురాలు సుప్రియా సూలే కూడా హాజరయ్యారు. కానీ సమావేశం అనంతరం ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. ప్రపుల్ పటేల్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కనుంది ప్రచారం జరుగుతోంది.

ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. అప్పటినుంచి అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నారు. శరద్ పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని ప్రకటన చేసిన రోజు నుంచి అజిత్ పవార్ మీడియా ఎదుటకు రాలేదు. తర్వాత తాను సంతోషంగానే ఉన్నానని ప్రకటించినా.. ఏదో మూల అసంతృప్తితోనే ఉన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి శిందే వర్గం పావులు కదిపి అజిత్ పవార్తో చేసిన సంప్రదింపులు ఫలించాయని దాని ఫలితంగానే ఈరోజు పార్టీలో చీలిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story