Qatar: మాజీ నేవీ అధికారులకు మరణశిక్షపై అప్పీల్‌

Qatar: మాజీ నేవీ అధికారులకు మరణశిక్షపై అప్పీల్‌
8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష.. స్పందించిన భారత్

భారత నౌకాదళంలో పనిచేసిన 8 మంది మాజీ సిబ్బందికి ఖతర్‌లోని ఓ కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్‌ దాఖలు చేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాగ్చీ చెప్పారు. గూఢచర్యం ఆరోపణలతో వీరికి మరణశిక్ష విధించినట్టు సమాచారమున్నదని తెలిపారు.ఈ కేసు నుంచి బయటపడేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

గూఢ చర్యం ఆరోపణలతో అరెస్ట్ అయి కొన్ని నెలలుగా ఖతార్ జైలులో మగ్గిపోతున్న 8 మంది భారతీయులకు మరణ శిక్ష విధిస్తూ ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయిన ఆ 8 మంది మాజీ ఉద్యోగులు.. ఖతార్‌ వెళ్లారు. అక్కడే ఓ ప్రైవేటు భద్రతా సంస్థలో పని చేస్తున్నారు. అయితే ఆ 8 మంది గూఢచర్యం చేస్తున్నారని.. ఖతార్ రహస్యాలను ఇజ్రాయెల్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అక్కడి అధికారులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కొన్ని నెలలుగా వారిపై విచారణ జరగ్గా.. చివరికి కోర్టు వారికి మరణ దండన విధించింది.

గత ఏడాది ఆగస్టులో అరెస్టయిన ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తాజాగా వెల్లడించారు. గతంలో ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని భారత ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఇప్పటికీ ఈ కేసు వివరాలు అందుబాటులో లేవని విదేశాంగశాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ప్రస్తుతం అప్పీల్ చేశామని.. తదుపరి చట్టపరమైన మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

ప్రస్తుతం మరణ శిక్ష పడి.. జైలులో ఉన్న 8 మంది నేవీ మాజీ అధికారులను కలిసేందుకు ఖతార్ రాజధాని దోహాలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి మరో అవకాశం లభించిందని అరిందమ్ బాగ్చి తెలిపారు. ఈ ఈ నేపథ్యంలోనే వారికి అవసరమైన న్యాయపరమైన, దౌత్యపరమైన పూర్తి సహకారాన్ని భారత ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. 8 మంది బాధితుల కుటుంబ సభ్యులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలతో విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కూడా ఇటీవలే ఢిల్లీలో భేటీ అయ్యారని అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

అటు ఈ ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన వారు కూడా ఉన్నారని, అరెస్టు అయినప్పుడు దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం వీరు పనిచేస్తున్నారనిసమాచారం.దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ. ఇటాలియన్ టెక్నాలజీ ఆధారంగా స్టెల్త్ సబ్‌మెరైన్‌లు, కొంతమంది నావికులు సున్నితమైన ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు వచ్చినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story