Joe Biden: రెండు రోజుల ముందే ఇండియాకు అమెరికా అధ్యక్షుడు

Joe Biden:  రెండు రోజుల ముందే ఇండియాకు  అమెరికా అధ్యక్షుడు
ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్న ఇరువురు దేశాధినేతలు

ఇండియాలో జరగనున్న జీ20 సమావేశాలకు పలు దేశాల అధ్యక్షులు రానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితేఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం సమావేశాలకు రెండు రోజుల ముందే భారత్ కు రానున్నారు. ఆయన జీ20 సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ప్రధాని మోదీతో బైడెన్ ప్రత్యేకంగా భేటీ అవుతారని, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది.

గురువారం నాడు బైడెన్ ఢిల్లీకి బయల్దేరుతారని, సెప్టెంబర్ 8న మోదీతో భేటీ అవుతారని తెలిపింది. 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ లో పాల్గొంటారని... ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సమస్యలు, క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ ఛేంజ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పేదరికంపై పోరాటం వంటి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చిస్తారని వెల్లడించింది.


అంతే కాదు జీ20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న తీరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారని శ్వేతసౌధం తన ప్రకటనలో చెప్పింది. ఈ సందర్బంగా ఆర్థిక సహకారానికి పాటుపడే జీ20 కూటమికి తాము కట్టుబడి ఉన్నామని, 2026లో ఈ కూటమికి నాయకత్వం వహించడానికి అమెరికా ఎదురుచూస్తోందని తెలిపింది.

20 ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని దిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి 29 దేశాల అధినేతలతో పాటు ఐరోపా సమాఖ్య, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీని సర్వాంగ సుందరంగా తయారు చేయడంతో పాటు పూర్తి సెక్యూరిటీతో సిద్ధం చేస్తున్నారు. జీ20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే, యూకే, యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానిత దేశాలుగా బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ ఉన్నాయి.


G-20 అధ్యక్ష బాధ్యతల్ని 2022 డిసెంబర్ 1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించింది. జీ-20 సమావేశం దృష్ట్యా దిల్లీలోని బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మార్కెట్​లు సహా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలను సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 3 రోజులు మూసివేయనున్నారు. అయితే న్యూఢిల్లీతో సహా ఢిల్లీ అంతటా అన్ని మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు, పాల బూత్‌లు, కూరగాయలు, పండ్ల దుకాణాలు తెరిచి ఉంచేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు. నియంత్రిత జోన్‌లోకి ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సిబ్బంది, వైద్య నిపుణులు, పారా-మెడిక్స్ వారి ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించడానికి అనుమతి లభించింది.

Tags

Read MoreRead Less
Next Story