BJP: ఎన్డీయే బలోపేతంపై బీజేపీ నజర్..

BJP: ఎన్డీయే బలోపేతంపై బీజేపీ నజర్..
జులై 18న పాత మిత్రులతో భేటీ

మరోవైపు బీజేపీ ఎన్డీయే అవసరాన్ని కాస్త లేటుగానే గుర్తించింది.2014, 2019 ఎన్నికల్లో ఎవరి మీదా ఆధారపడనంత సంఖ్యలో ఎంపీలను గెలుచుకున్న పార్టీ కూటమిలోని పార్టీల అభిప్రాయాలతో పని లేకుండానే నిర్ణయాలు తీసుకుంది.ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎవరినీ పట్టించుకోకుండా బీజేపీ విధానాలను దూకుడుతనంలో మోదీ ప్రభుత్వం అమలు చేసేసింది. అతి విశ్వాసంతో కనిపించింది. ఇది ఎన్డీయేలోని చిన్న పార్టీలకు కాస్త ఇబ్బందిగానే వున్నా సంఖ్యాబలానికి తలవంచారు చాలామంది. ఇపుడు మరోసారి లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఉత్తరాది పార్టీగా పేరున్న బీజేపీ ఉత్తర భారత రాష్ట్రాలలో ఇప్పటికే మెజార్టీ సీట్లను గెలుచుకుంది. అక్కడ ఇంకా నెంబర్ పెంచుకునే అవకాశం తక్కువ. ఈ నేపధ్యంలో దక్షిణాదిన తమ ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకోవాలని ప్లాన్ చేశారు కమల నాథులు. అయితే కర్నాటక ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు రావడంతో ఎన్డీయే బలోపేతంపై బీజేపీ హైకమాండ్‌ దృష్టి పెట్టింది. పాత మిత్రులతో భేటీకి జులై 18వ తేదీని ఖరారు చేసింది.ఈ భేటీకి ప్రధాని స్వయంగా హాజరు అవుతారన్న మెస్సేజ్‌ మిత్రపక్షాలకు పంపింది.

ఇక ప్రస్తుత మిత్రులతోపాటు గతంలో కూటమి నుంచి వైదొలగిన పార్టీలకు ఆహ్వానం పంపారు. శిరోమణి ఆకాలీదళ్, శివసేన షిండే వర్గం, లోక్‌జనశక్తి పార్టీలతోపాటు ఈశాన్య రాష్ట్రాలలోని చిన్న మిత్ర పార్టీలకు ఆహ్వానం పంపారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ దగ్గరైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి కూడా ఆహ్వానం పంపారు. ఏపీలో ఇదివరకే మిత్రపక్షంగా వున్న జనసేనకు ఆహ్వానం వెళ్ళింది. జులై 18 తర్వాత ఎన్డీయేపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.ఈ సమావేశంలో మిత్ర పక్షాలు ఎన్డీయే విస్తరణకు సూచనలు చేస్తే వాటి ఆధారంగా మరిన్ని పార్టీలకు ఆహ్వానం పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు గత తొమ్మిదేళ్ళుగా మిత్రపక్షాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలను ఎదుర్కొంది బీజేపీ.చిరకాలంగా తమతో కొనసాగిన మిత్ర పక్షాలను దూరం చేసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదళ్ మూడేళ్ళక్రితమే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకూ గుడ్ బై చెప్పింది.మహారాష్ట్ర రాజకీయాలలో ఎవరిది పైచేయి అన్న అంశంపై శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. నితీశ్ కుమార్ జేడీయూ, పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఇలా ఎన్డీయేకు దగ్గరై దూరం జరిగిన పార్టీలు చాలానే వున్నాయి. వాటిలో కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్డీయేని వీడితే మరికొన్ని బీజేపీ పట్టించుకోవడం లేదంటూ కూటమిని వీడాయి.

ఇక మిత్రపక్షాల అవసరాన్ని గుర్తించిన బీజేపీ, వాటిని బలపరిచే దిశగా అడుగులేస్తోంది.యుపీలో చిన్న పార్టీలైన అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు కొనసాగిస్తోంది.బీహార్‌లో తమకు ఒకప్పుడు మొండి చేయి చూపిన జితన్ రామ్ మాంఝీ, వికాస్ షీల్ పార్టీ, కుష్వాహా పార్టీలను దాదాపు తమ వైపునకు తిప్పేసుకుంది బీజేపీ నాయకత్వం. కర్నాటకలో జనతా దళ్ సెక్యులర్ పార్టీని కూటమిలో చేర్చుకునే యత్నాలను బీజేపీ నాయకత్వం వేగవంతం చేసింది.ఇటీవల మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఆయన ఎన్డీయేకు దగ్గరవుతున్నారన్న సంకేతాలు పంపాయి.మొత్తమ్మీద ఇవాళ, రేపు తేదీలలో విపక్షాల భేటీ, జులై 18న బీజేపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి భేటీ జాతీయ రాజకీయాలలో కొత్త మార్పుకు దారి తీసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story