Uttar Pradesh: పట్టు కోసం కాంగ్రెస్ పాట్లు

Uttar Pradesh: పట్టు కోసం కాంగ్రెస్ పాట్లు
వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం..

వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా....ఒకప్పటి కంచుకోట అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లో తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ఎక్కువసీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకోసం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేసహా హేమీహేమీలను బరిలో దించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది.

దిల్లీ గద్దె నెక్కాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌ దగ్గరి దారి అని రాజకీయ పార్టీలు భావిస్తాయి. ఆ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు సాధిస్తే హస్తిన పీఠం దక్కుతుందని విశ్వసిస్తాయి. అందుకే యూపీ లక్ష్యంగా జాతీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తాయి. అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడింటేందుకు విపక్షాలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పెద్దరాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువస్థానాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. పార్టీకి చెందిన ప్రముఖనేతలను వీలైనంతవరకు ఎక్కువగా యూపీ నుంచే బరిలో దింపాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం ప్రణాళిక రచిస్తోంది. ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన హస్తం పార్టీ తిరిగి పూర్వవైభవం సాధించేందుకు మేథోమధనం చేస్తోంది. మోదీ సర్కార్‌పై వ్యతిరేకత, క్రమక్రమంగా బీఎస్పీ ప్రాభవం కోల్పోతుండటం వంటివి కలిసొచ్చే అంశాలని భావిస్తోంది. దళిత ఓటుబ్యాంకును తిరిగి దక్కించుకునేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి


ఉత్తర్‌ప్రదేశ్‌లో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగిన బహుజన సమాజ్‌ పార్టీ ప్రాభవం కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఛరిష్మ, దళితులు ముఖ్యంగా జాతవ్‌లపై ఆ పార్టీ పట్టు సడలినట్లు హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. అందువల్ల బీఎస్పీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు తమపార్టీకే ఉంటాయని హస్తం నేతలు లెక్కలు వేస్తున్నారు. ఆ కారణంతోనే పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ఇటావా లేదా బారాబంకీ నుంచి బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఖర్గే పోటీ చేయటం వల్ల సమీప నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులకు కూడా ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌, ఎస్పీరెండుపార్టీలు ఇండియా కూటమిలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యూపీతోపాటు చాలాకాలం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కర్ణాటక నుంచి కూడా ఖర్గే పోటీ చేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.


కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ....ఆ పార్టీ సంప్రదాయ సీటు అమేథీ నుంచి, ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ....ప్రయాగ్‌రాజ్‌ లేదా పూల్‌పుర్‌ లేదా వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్య కారణాలతో సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దూరంగా ఉంటే ప్రియాంకతో ఆ స్థానాన్ని భర్తీ చేయవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story