Congress: 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి ఎందుకు..?

Congress: 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ దుస్థితి ఎందుకు..?
Congress: మినీ సార్వత్రికంగా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

Congress: మినీ సార్వత్రికంగా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ సత్తా చూపి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్… తీరా ఎన్నికలకు వచ్చే సరికి​ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. కాళ్లకు చక్రాలు కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగారు. రాహుల్‌ గాంధీ సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రైతు పోరాటాలు, ఉన్నావ్‌, హత్రాస్‌ వంటి చోట్ల మహిళలపై జరిగిన దాడులు, లఖీంపూర్‌ ఖేరీ ఘటనలను… ప్రచారాంశాలుగా ఎంచుకున్నారు. బీజేపీ సర్కారుపై విరుచుకుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు. మహిళలను టార్గెట్‌గా చేసుకుని లడ్‌కీ హూ.. లడ్‌ సక్తీ హూ అంటూ నినాదాలిచ్చారు.

ఇవేవీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మర్యాదపూర్వకమైన స్థానాన్ని కూడా కట్టబెట్టలేకపోయాయి. 403 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపి కేవలం రెండంటే రెండే స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. చివరికి గాంధీ పరివారానికి కంచుకోటలైన అమేథీ, రాయ్‌ బరేలీ లో కూడా కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఇక్కడ కాంగ్రెస్‌ ఓటమికి కారణాలు వెతకడం మొదలుపెడితే.. ఆ జాబితా చాంతాడంత అవుతుంది.

పేరుకు రాహుల్‌, ప్రియాంక ప్రచారం చేసినా.. వారి తర్వాత రాష్ట్రంలో చెప్పుకోదగిన నేత ఎవరూ లేదు. ఉన్న వారిలోనూ సఖ్యత లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ అనగానే ఎవరిని చూసి ఓటువేయాలో జనానికి ఓ క్లూ లేకుండా పోయింది. దాని ఫలితమే ఈ ఎన్నికల్లో వచ్చిన ఘోరమైన ఫలితాలు. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలే ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టి ముంచాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్​లో మొదటి నుంచే నేతల మధ్య విబేధాలు మొదలయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచింది. కొన్ని సందర్భాల్లో కెప్టెన్​పై బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్ధూ.

అంతర్గత కలహాలు చినికి చినికి గాలివానగా మారి కెప్టెన్​ వేరుకుంపటి పెట్టేందుకు దారితీశాయి. కొత్త సీఎం అభ్యర్థిగా చరణ్​జీత్​ సింగ్​ చన్నీని ప్రకటించి.. బలహీన వర్గాల ఓట్లను ఒడిసిపట్టాలన్న కాంగ్రెస్​ వ్యూహం కూడా బెడిసికొట్టింది. పీసీసీ చీఫ్‌గా ఉంటూ సిద్ధూ నిర్వహించిన శల్య సారథ్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయేలా చేసింది. ఇక ఉత్తరాఖండ్‌లోనూ కాంగ్రెస్‌ది అదే పరిస్థితి.

అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను క్యాష్‌ చేసుకోవడంలో ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చినా… దాన్ని ఎన్నికల్లో ప్రచారాంశంగా చేసుకోలేకపోయింది. ఇక నాయకత్వ లేమి కూడా ఆ పార్టీ పాలిట శాపంగా మారింది. మాజీ సీఎం హరీష్‌ రావత్‌ మినహా చెప్పుకోదగిన నేతలెవరూ లేకపోవడం హస్తం పార్టీకి పెద్ద మైనస్‌ అయింది. ఉన్న కొద్ది పాటి నాయకులు పార్టీని వీడుతున్నా అధిష్టానం చేతులు కట్టుకుని చూసిందే తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.

అటు గోవాలోనూ కాంగ్రెస్‌ మరోసారి చతికిల పడింది. 2017లో అతిపెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన కాంగ్రెస్‌... ఈ సారి మేజిక్ ఫిగర్‌కు చాలా దూరంలోనే నిలిచిపోయింది. అయితే మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ ఫర్వాలేదనిపించింది. మణిపూర్‌లోనూ కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగానే మారింది. ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన ఆ పార్టీ ఇప్పుడు.. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఇంతకీ కాంగ్రెస్‌ పరిస్థితి ఇంతలా ఎందుకు దిగజారిందని చూస్తే.. అసలు లోపం అధిష్టానం దగ్గరే కనిపిస్తుంది.

125 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీకి కొన్నేళ్లుగా అధ్యక్షుడే లేరు. కేవలం తాత్కాలిక అధ్యక్షుని పేరిట వ్యవహారాలు అలా నడిచిపోతున్నాయి. ఇక అన్నీ అయి ఆదుకుంటారనుకున్న రాహుల్‌ గాంధీ సీజనల్‌ పొలిటీషియన్‌గా మిగిలిపోతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడో, లేక ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడో అడపా దడపా హడావుడి చేయడం ఆ తర్వాత కనిపించకుండా పోవడం కామన్‌గా మారింది.

కాలానికి తగినట్లుగా పార్టీ మారాలంటూ నిక్కచ్చిగా సూచించిన సీనియర్‌ నేతలపై… రెబల్‌ ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకే దిశానిర్దేశం చేసే వారు కరువైతే… ఇక ఎన్నికల్లాంటి పెద్ద విషయాల గురించి అడిగేదేముంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే… రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పరిస్థితి కమ్యూనిస్టుల్లా తయారయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story