DELHI FLOODS: వరద గుప్పిట్లో ఢిల్లీ..కొనసాగుతున్న సహాయక చర్యలు

DELHI FLOODS: వరద గుప్పిట్లో ఢిల్లీ..కొనసాగుతున్న సహాయక చర్యలు

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికీ వరద గుప్పిట్లోనే ఉంది.అనేక లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఎర్రకోట పరిసరాలు, మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వరద నీటిలోనే ఉన్నాయి. కశ్మీర్‌ గేట్‌ వద్ద మోకాల్లోతు ఉన్న నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మయూర్‌ విహార్‌, ఓల్డ్‌ యమునా బ్రిడ్జ్‌ ప్రాంతాల్లో అనేక మంది బహిరంగ ప్రదేశాల్లోనే టార్పాలిన్‌ కవర్లు కప్పుకుని నిద్రపోతున్నారు. మరో దారిలేక ఆరుబయటే మలవిసర్జనకు పాల్పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని బాధిత ప్రజల కోసం వసతి, ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు సహా ప్రత్యేక సహాయ పునరావాస చర్యలు చేపడుతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మోరి గేట్‌లోని సహాయక శిబిరాన్ని సందర్శించి అక్కడి వారికి ధైర్యం చెప్పారు.

ఢిల్లీని ముంచెత్తిన వరద ప్రవాహం కాస్త నెమ్మదించింది. వరదలు తగ్గుముఖం పట్టినా.. పరిస్థితి ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మళ్లీ భారీ వర్షం కురియడంతో మరోసారి వరద ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు ఢిల్లీవాసులు. యుమునా బ్యారేజీలో మొరాయిస్తున్న ఐదు గేట్లను తెరిచేందుకు యత్నాలు జరుగుతున్నాయి. గృహాల్లో, చుట్టుపక్కలా పేరుకుపోయిన బురదను తొలగించుకునే ప్రయత్నాల్లో పడ్డారు.యమునా నీటి మట్టం 205 మీటర్ల దిగువకు తగ్గినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రమాదకర నీటి మట్టమైన 205.33 కంటే ఇది ఎక్కువే. మళ్లీ వర్షాలు లేకపోతే నీటిమట్టం మరింత తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇక వరద బాధిత కుటుంబాలన్నింటికీ 10వేలు చొప్పున కేజ్రీవాల్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. బట్టలు, పుస్తకాలు కొట్టుకుపోయిన పిల్లలకు పాఠశాలలే వాటిని సమకూరుస్తాయని తెలిపారు. ఆధార్ సహా ఇతర విలువైన పత్రాలు పోగొట్టుకున్నవారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. యమునా నది సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇవాళ, రేపు సెలవులు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story