Lok Sabha elections 2024: పకడ్బందీగా ఎన్నికల విధులు

Lok Sabha elections 2024:  పకడ్బందీగా ఎన్నికల విధులు

లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం.. దేశ వ్యాప్తంగా ఎన్నికల అబ్జర్వర్లతో కీలక సమావేశం నిర్వహించింది. ఎటువంటి నిర్బంధాలు, బెదిరింపులకు తావు లేని వాతావరణంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని సూచించింది. కేంద్ర రాష్ట్ర బలగాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని, అవి ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన త్వరలో రానున్న నేపథ్యంలో 2100 మందికిపైగా ఎన్నికల పరిశీలకులతో EC సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. వీరిలో సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకులు ఉన్నారు. ప్రలోభాలకు తావులేకుండా చూడాలని, ఎన్నికల సంఘ ప్రతినిధిగా, వృత్తిపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సూచించారు. అభ్యర్థులతో పాటు అన్ని భాగస్వామ్యపక్షాలకు పరిశీలకులు అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో కఠినంగానే వ్యవహరిస్తూ, మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు పరిశీలకులు తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాలకే పరిమితమై ఉండేలా చూడాలని, వారి వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ అమర్చాలని ప్రతిపాదించారు. ఎన్నికల నిర్వహణకు ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ,మెయిల్ నంబర్స్ కు తగిన ప్రచారం కల్పించాలని దిశానిర్దేశం చేసింది. ఎన్నికల పరిశీలకులందరూ ఫోన్, మెయిల్ కు అందుబాటులో ఉండాలని చెప్పింది. ఎన్నికల ప్రణాళిక, పరిశీలకుల పాత్రతో పాటు వారి బాధ్యతలు, ఎలక్టోరల్ రోల్ సమస్యలు, ప్రవర్తనా నియమావళి అమలు, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వీవీప్యాట్ల నిర్వహణ, మీడియా ఎంగేజ్‌మెంట్ పై పరిశీలకులకు అవగాహన కల్పించింది.

స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, బెదిరింపులు, ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని పరిశీలకులకి దిశానిర్దేశం చేశారు రాజీవ్ కుమార్. పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి భౌగోళిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సున్నిత ప్రాంతాలను పరిశీలించాలని సూచించారు. పోలింగ్ రోజున పోలింగ్ వేళల్లో, వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ స్టేషన్‌లలోని పరిస్థితిని క్రమం తప్పకుండా అంచనా వేయాలని అన్నారు.

కాగా, కేంద్ర ఎన్నికల సంఘంలో రెండు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.

సెర్చ్ కమిటీ పరిశీలనలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాధా చౌహాన్, మరికొందరి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నాటికి ఎన్నికల కమిషనర్ల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీ ప్రస్తుతం ఐదుగురి పేర్లతో జాబితా రూపొందించే పనిలో ఉంది. సెర్చ్ కమిటి సిఫారసుల మేరకు సెలెక్ట్ కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది.

అటు, ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్ సభ ఎన్నికలు కొన్ని వారాల్లో జరగనుండగా, కేంద్ర ఎన్నికల సంఘంలో పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.


Tags

Read MoreRead Less
Next Story