Gujarat :భారీ వర్షాలతో అతలాకుతలం..

Gujarat :భారీ వర్షాలతో అతలాకుతలం..

భారీ వర్షాలు గుజరాత్ ను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షం కారణంగా బొటాద్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. జునాగఢ్ లో వర్షం విపరీతంగా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.నగరంలోకి పెద్ద మొత్తంలో నీరు ప్రవేశించింది. ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అయినప్పటికీ, NDRF, SDRF బృందాలు అక్కడ మోహరించారు. కొన్ని అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో వాహనాలు నీట మునిగాయి. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు.



ఇక అహ్మదాబాద్ లో కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. అక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా నీట్లో మునిగిపోయింది. టెర్మినల్ ప్రాంతంలో మోకాలి లోతు నీరు ప్రవహిస్తూ ఉండడంతో విమాన ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజ్‌కోట్ జిల్లా నుంచి మున్సిపల్ బృందాలు, 25,000 ఫుడ్ ప్యాకెట్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కూడా సహాయ చర్యల కోసం జునాగడ్‌కు పంపుతున్నట్లు రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభవ్ జోషి తెలిపారు. భారీ వర్షాల కారణంగా, సిఎం భూపేంద్ర పటేల్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి, కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ గుజరాత్ సహా సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. డ్యామ్ లు, నదులలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకోవడంతోసమీప ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు, అత్యవసర పరిస్థితులు ఎదురైతే కంట్రోల్ రూంను సంప్రదించాలని అధికారులు కోరారు. ఆనకట్టలు, పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు.ఎందుకంటే వర్షాల కారణంగా పశువులు, వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ...గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడి...వరద పరిస్థితిపై ఆరా తీశారు. సహాయక బృందాలను పంపిస్తామని...హామీ ఇచ్చారు. జూలై 24 నాటికి వర్షపాతం తీవ్రత తగ్గుతుందని, జూలై 25న కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని IMD అహ్మదాబాద్ హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story