రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం

రోడ్డు ప్రమాద బాధితులకు  ఉచిత వైద్యం
కేంద్రం కీలక నిర్ణయం, నాలుగు నెలల్లో అమలు

రోడ్డు ప్రమాద బాధితులకు ఇకపై ఉచిత వైద్యం అందనుంది. దేశవ్యాప్తంగా నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి రావచ్చని కేంద్ర రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ సోమవారం వెల్లడించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ (ఐఆర్‌టీఈ) ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తూ.. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధికం భారత్‌లోనే నమోదవుతున్నాయని గుర్తుచేశారు. సవరించిన మోటర్‌ వాహన చట్టం-2019లో భాగంగా ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు దీన్ని అమలు చేస్తున్నాయని, ఇప్పుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి రహదారుల శాఖ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నదని వివరించారు. "ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికంగా ఉన్న దేశం ఇండియా. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50శాతం మేర తగ్గించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాము. ఎడ్జ్యుకేషన్​, ఇంజినీరింగ్​, ఎన్​ఫోర్స్​మెంట్​, ఎమర్జెన్సీ కేర్​ వంటి 5ఈ విధానాన్ని అనుసరిస్తున్నాము. ఇందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత, క్యాష్​లెస్​ వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

వివిధ రాష్ట్రాల్లోని పోలీసు విభాగాల ప్రకారం.. 2022లో ఇండియాలో 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరిలో 1,68,491 మంది మరణించారు. 4,43,366 మంది గాయపడ్డారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగం అని రోడ్డు రవాణా- రహదారులశాఖ పేర్కొంది. రాంగ్​ సైడ్​లో డ్రైవింగ్​, ట్రాఫిక్​ లైట్స్​ని విస్మరించడం, మద్యం సేవించి వాహనాన్ని నడపడం వంటివి ప్రమాదాలకు ఇంకొన్ని కారణాలని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story