G20 summit: భారత్‌-గల్ఫ్‌-యూరప్‌ మహా రైల్‌, పోర్ట్‌ కారిడార్‌

G20 summit: భారత్‌-గల్ఫ్‌-యూరప్‌ మహా రైల్‌, పోర్ట్‌ కారిడార్‌
భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాల మీదుగా యూర్‌పలోని ఏ నగరానికైనా రవాణాను సులభతరం

జీ 20 సదస్సు వేదికగా మరో భారీ ఒప్పందం కుదిరింది. భారత్‌-గల్ఫ్‌- యూరప్‌లను రైలు, జల మార్గాల ద్వారా అనుసంధానించే ప్రాజెక్టుకు దేశాలు అంగీకారం తెలిపాయి. రైలు, షిప్పింగ్ కారిడార్‌ను బిగ్‌ డీల్‌గా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అభివర్ణించారు. ఇది ఆర్థిక, రాజకీయ సహకారాన్ని పెంపొందిస్తుందని సభ్య దేశాలు ప్రకటించాయి. వాణిజ్యం, ఇంధన వనరుల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ కారిడార్ సహాయపడనుంది. ఇందులో భారత్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్, ఉంటాయని బైడెన్‌ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవన్ తెలిపారు.


ప్రపంచం మొత్తానికి నూతన దశాదిశా చూపాల్సిన అద్భుత సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ జీ 20 దేశాలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రపంచమంతా కలిసి సాగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భారత్ జీ-20అధ్యక్ష హోదాలో.... దేశంలోపల, వెలుపల చేరికకు చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. జీ20 సదస్సులో భాగంగా భారత్ ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జీవ ఇంధనాల అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేద్దామని సభ్య దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ ప్రపంచ జీవ ఇంధన' కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సరికొత్త జీవ ఇంధనాల అభివృద్ధికి ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ- వాతావరణం పరిశీలన కోసం G20 ఉపగ్రహ మిషన్‌ను ప్రారంభించాలని ప్రధాని మోదీ సభ్య దేశాల ముందు ప్రతిపాదించారు. వన్‌ ఎర్త్‌ సదస్సులో మాట్లాడిన మోదీ గ్రీన్‌ క్రెడిట్‌ ఇన్‌షియేటీవ్‌పై పని ప్రారంభించాలని కోరారు. ఇంధనం విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందనిప్రధాని సూచించారు.


వాతావరణ మార్పులు సవాల్‌ విసురుతున్న వేళ 21వ శతాబ్దపు ప్రపంచానికి ఇంధన ప్రత్యామ్నాయం చాలా ముఖ్యమైన అవసరమని వివరించారు. కొవిడ్‌ తర్వాత దేశాల మధ్య నమ్మకం సన్నగిల్లిందని, ఉక్రెయిన్‌ యుద్ధంతో అది మరింత దిగజారిందని మోదీ పేర్కొన్నారు. దీనిని తిరిగి సాధించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కొవిడ్‌ను ఓడించిన మనకు ఇది అసాధ్యమేమీ కాదన్నారు. వన్‌ ఎర్త్‌ సెషన్‌లో మాట్లాడుతూ ‘‘పాత సవాళ్లు కొత్త జవాబులు కోరుతున్నాయి. ఈ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ నిర్దేశించేందుకు కీలక సమయం ఇదే. మానవ కేంద్రీకృత దృక్పథంతో కదులుదాం’ అని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story