BHARAT RICE: రూ.29లకే భారత్‌ రైస్‌

BHARAT RICE: రూ.29లకే భారత్‌ రైస్‌
బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్య పౌరులకు కేంద్రం ఊరట...వచ్ఛే వారం నుంచి భారత్‌ రైస్‌

దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్య పౌరులకు ఊరట కలిగించేందుకు భారత్‌ రైస్‌ పేరిట కిలో బియ్యం 29 రూపాయలకే కేంద్రం విక్రయించనుంది. వచ్చే వారం నుంచి భారత్‌ రైస్‌.... ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. తొలిదశలో భాగంగా 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత్‌ రైస్‌ కోసం కేటాయించింది. బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా నిల్వలు ఎంత ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా బియ్యం ధరలకు రెక్కలు రావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే వారం నుంచి భారత్‌ రైస్‌ పేరిట కేజీ బియ్యం 29 రూపాయలకే విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సామాన్య పౌరులకు ఊరట కలిగిస్తుందని పేర్కొంది. బియ్యం ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా నిల్వలు ఎంత ఉన్నాయో ట్రేడర్లు ప్రకటించాలని కేంద్రం ఆదేశించింది. గత కొన్ని నెలలుగా బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించినా గత ఏడాదిగా బియ్యం ధరలు 15 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌ రైస్‌ పేరిట రాయితీ ధరకు బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు సహకార సంస్థలు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహా రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా భారత్‌ రైస్‌ విక్రయాలను చేపట్టనున్నారు. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా భారత్‌ రైస్‌ను విక్రయించనున్నారు. వచ్చే వారం నుంచి 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌ల రూపంలో భారత్‌ రైస్‌ అందుబాటులోకి రానుంది.

తొలిదశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్‌ మార్కెట్‌ కోసం కేంద్రం కేటాయించింది. ఇప్పటికే భారత్‌ అటా పేరిట గోధుమ పిండిని కిలో 27 రూపాయల 50 పైసలుకు కేంద్రం విక్రయిస్తోంది. భారత్‌ దాల్‌ పేరిట శెనగ పప్పును కిలో 60 రూపాయలకు కేంద్రం విక్రయిస్తోంది. బియ్యం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఇప్పట్లో ఎత్తివేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా బియ్యం ధరలు తగ్గేవరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. తమ తమ పోర్టల్‌లలో బియ్యం నిల్వలు ఎన్ని ఉన్నాయో రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు ప్రతీ శుక్రవారం బహిరంగపర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బియ్యం నిల్వలపై ఆంక్షలు విధించే అవకాశాలు కూడా తోసిపుచ్చలేమని సంకేతాలు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story