PM Modi: కాంగ్రెస్‌కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా-ప్రధాని మోదీ

PM Modi:  కాంగ్రెస్‌కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా-ప్రధాని మోదీ
నార్త్, సౌత్ అంటూ విభజిస్తారంటూ ఆగ్రహం

కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) పుట్టుకతోనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని...ప్రధాని మోదీ (PM Modi) ఆరోపించారు. ఆ పార్టీకి దళితులు, గిరిజనులు, ఓబీసీలంటే గిట్టదన్నారు. కాలం చెల్లిన విధానాల వల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 40సీట్లు కూడా రావని కొందరు అంటున్నారని, ఆ మాత్రం స్థానాలైనా గెలవాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. గతంలో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దుచేసిన హస్తం పార్టీ ఇప్పుడు స్వలాభం కోసం ఉత్తర, దక్షిణ రాష్ట్రాల విభజన తెచ్చేందుకు కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, మొదటి నుంచి ఆ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. హస్తం పార్టీ తన పనిని అవుట్‌ సోర్సింగ్‌కు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థాయికి దిగజారటం తమకు సంతోషం కలిగించే విషయం కాకపోయినా అందుకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40సీట్లు కూడా రావని ఆ పార్టీ మిత్రులే అంటున్నారు కానీ...తాను మాత్రం 40చోట్ల అయినా గెలుపొందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యసభలో (Rajya Sabha) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ నేతలు, వారి విధానాలపైనే గ్యారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ...మోదీ గ్యారెంటీలను ప్రశ్నిస్తోందని దుయ్యబట్టారు. అప్పట్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఆ పార్టీకి తెలిసినప్పటికీ...వాటి పరిష్కారానికి ఏమీ చేయలేకపోయిందన్నారు. తమ ప్రభుత్వం దేశాన్ని సమస్యల గట్టెక్కించిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బ్రిటీషర్ల ద్వారా స్ఫూర్తి పొందిందని, అందుకే దశాబ్దాల పాటు బానిసత్వ చిహ్నాలను కొనసాగించినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. అంతేకాకుండా అధికారంపై మక్కువతో...ప్రజాస్వామ్యానికి పాతరేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు వ్యతిరేకమని ప్రధాని మోదీ ఆరోపించారు. పుట్టుకతోనే ఆ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ అప్పట్లో సీఎంలకు లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖను ప్రధాని మోదీ రాజ్యసభలో చదివి వినిపించారు.

దేశానికి ఇప్పుడు సహకార సమాఖ్య పోటీతత్వం అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీఉండాలని, అప్పుడే వేగంగా ముందుకు వెళ్తాయన్నారు. అందుకు సానుకూల దృక్పథం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story