Coronavirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు

Coronavirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు
కొత్త వేరియంట్‌పై ఢిల్లీ ఎయిమ్స్‌ గైడ్‌లెన్స్, నిర్లక్ష్యం చేయొద్దని వార్నింగ్

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 700కు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 702 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకూ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,50,10,944కి చేరింది.

ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,097గా ఉంది. మహమ్మారి నుంచి ఇప్పటి వరకూ 4,44,73,448 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఆరు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,33,346కి ఎగబాకింది.

ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీలోనూ తొలికేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఢిల్లీ AIIMS అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి కొన్ని మార్గదర్శకాలు (AIIMS Guidelines) జారీ చేసింది. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కి వస్తున్న బాధితులను స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది.

1. ఎయిమ్స్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్‌లలోని వార్డులలో కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

2. ఓ వార్డులో ప్రత్యేకంగా 12 పడకలు సిద్ధం చేయాలి. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఇక్కడే చికిత్స అందించాలి.

3. ఓపీ డిపార్ట్‌మెంట్‌లో కొవిడ్‌ తరహా లక్షణాలతో బాధ పడుతున్న వాళ్లకి తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయాలి.

4. వీలైనంత త్వరగా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఫిల్టర్‌లు ఏర్పాటు చేయాలి.

డిసెంబర్ 27వ తేదీన JN.1వేరియంట్ తొలికేసు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ అయిన JN.1 సోకినా స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, సౌత్ ఇండియాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఇప్పటి వరకూ ఢిల్లీలో 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story