UN: ఐరాస నిపుణుల ఆరోపణలపై భారత్‌ ఆగ్రహం

UN: ఐరాస నిపుణుల ఆరోపణలపై భారత్‌ ఆగ్రహం
మణిపుర్‌ హింసపై నిపుణుల బృందం ఆరోపణలు.. ఆరోపణలన్నీ అసమంజసమన్న భారత బృందం...

మణిపుర్‌ హింసపై ఐరాస నిపుణుల బృందం చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం చేసిన ఆరోపణలు అసమంజసం, ఊహాజనితమైనవని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. మణిపుర్ లో పరిస్థితి నిలకడగా ఉందనీ, ప్రభుత్వం అక్కడ శాంతి, సుస్థిరతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని భారత ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది.

ఇటీవల ఐరాస నిపుణుల బృందం మణిపుర్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలు, దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. వీటిల్లో లైంగిక హింస, హత్యలు, గృహదహనాలు, బలవంతపు వలసలు, వేధింపులు, వివక్ష వంటి అంశాలను ప్రస్తావించింది. ఈ నివేదికపై స్పందించేందుకు ఉన్న 60 రోజుల గడువును కూడా దృష్టిలో పెట్టుకోకుండా విడుదల చేయడంపై ఐరాస భారత్ శాశ్వత బృందం అసహనం వ్యక్తం చేసింది.


ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న, జనాభా పరంగా మెజారిటీలుగా ఉన్న మెయితీ లకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పర్వత ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న గిరిజన కుకీ వర్గాలు నిరసనలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు దారుణంగా దాడులకు పాల్పడడం ప్రారంభించారు. ఈ హింసలో ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. రాష్ట్ర జనాభాలో మెయిటీ కమ్యూనిటీ 53 శాతం మంది ఉన్నారు. వారు ప్రధానంగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగా, కుకి వంటి గిరిజన సంఘాలు జనాభాలో 40 శాతం ఉన్నారు. వారిలో ఎక్కువ మంది కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.

మణిపూర్ అల్లర్ల అనంతరం నమోదైన కేసులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్ర పోలీసులు తమకు అప్పగించిన 27 కేసులపై సీబీఐ విచారిస్తోంది. ఇందులో 19 కేసులు మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించినవే. మే 3న రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. అయితే మణిపూర్‌లో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా వివరాలను బయటకు వెల్లడించలేదు.

Tags

Read MoreRead Less
Next Story