Fastest Growing Economy: దూసుకుపోతున్న భారత్..

Fastest Growing Economy: దూసుకుపోతున్న భారత్..
భార‌త ఆర్థిక వృద్ధిపై రిపోర్టు ఇచ్చిన ఐక్య‌రాజ్య‌స‌మితి

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోందని ఐరాస నివేదిక తెలిపింది. 2024లోభారత వృద్ధిరేటును 6.2 శాతంగా అంచనా వేసింది. దేశీయంగా బలమైన డిమాండ్‌ , తయారీ, సేవల రంగాల్లో వృద్ధి కారణంగా ఈ ఏడాది భారత్‌ మెరుగైన పనితీరు కనబరుస్తుందని పేర్కొంది. గతఏడాది పెట్టుబడుల పరంగా భారత్‌ గణనీయమైన వృద్ధి నమోదుచేసిందని గుర్తుచేసింది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితి-2024లో అవకాశాలు అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలోని.. ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది.. భారత వృద్ధి రేటు 6.2 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఐతే.. 2023 అంచనా అయిన 6.3శాతంతో పోలిస్తే ఇది తక్కువగానే ఉంది. ఈ ఏడాది వృద్ధికి... బలమైన దేశీయ గిరాకీ, తయారీ, సేవల రంగాల నుంచి మద్దతు లభిస్తుందని పేర్కొంది. చైనాలో ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, ప్రైవేట్ పెట్టుబడుల కొరతను పాక్షికంగా భర్తీ చేస్తున్నాయని వివరించింది. అయితే స్థిరాస్తి రంగంలోని సవాళ్ల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎదురు గాలులు వీస్తున్నాయని ఐరాస నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లో మాత్రం ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు,బహుళజాతి కంపెనీల పెట్టుబడుల్లో గణనీయంగా వృద్ధి నమోదైందని గుర్తుచేసింది. ఆర్థిక కార్యకలాపాల తీరును తెలియజేసే..మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్-PMI2023 మూడో త్రైమాసికంలో ఒక్క భారత్‌ మినహా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో క్షీణించిందని వెల్లడించింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పెట్టుబడులు బలంగా ఉన్నాయని పేర్కొంది. భారత్‌లో 2023లో పెట్టుబడుల సెంటిమెంట్‌.బలంగానే ఉందని తెలిపింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు తమ సరఫరా గొలుసులను మారుస్తుండడంవల్ల అనేక దేశాలు భారత్‌ను ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా చూస్తున్నాయని ఐరాస నివేదిక విశదీకరించింది. ఇది భారత్‌కు కలిసొస్తోందని విశ్లేషించింది. 2023లో ప్రకృతి విపత్తులు దక్షిణాసియా ప్రాంతాన్ని ప్రభావితం చేశాయన్న ఐరాస నివేదిక జులై, ఆగస్టులో భారత్‌, నేపాల్‌., బంగ్లాదేశ్‌లో చాలాప్రాంతాలు అనావృష్టిని ఎదుర్కొన్నాయని

తెలిపింది. భారత్‌లో ఆగస్టు నెలలో గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని, ఈ కారణంగా ప్రధాన పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడిందని గుర్తుచేసింది. ఈ పరిణామాలు వృద్ధిరేటుపై కొంత ప్రభావం చూపాయని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో GDP వృద్ధి 2023లో 2.7 శాతం నుంచి 2024లో 2.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2023లో మాంద్యం ముప్పు తప్పినప్పటికీ దీర్ఘకాలం తక్కువ వృద్ధిరేటుతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని అంచనా వేసింది. 2025లో వృద్ధిరేటు తిరిగి 2.7 శాతానికి మెరుగుపడుతుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story