NCP: మహారాష్ట్ర ఎన్సీపీలో సంక్షోభం..

NCP: మహారాష్ట్ర ఎన్సీపీలో సంక్షోభం..
శరద్‌ పవార్‌ వర్గం, అజిత్‌ పవార్‌ వర్గంగా విడిపోయి అసలైన ఎన్సీపీ తమదంటే తమదేనంటూ అంతర్గత కుమ్ములాటలతో రచ్చ రేపుతున్నాయి.

గత కొన్ని రోజుల నుండి మహారాష్ట్ర ఎన్సీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శరద్‌ పవార్‌ వర్గం, అజిత్‌ పవార్‌ వర్గంగా విడిపోయి అసలైన ఎన్సీపీ తమదంటే తమదేనంటూ అంతర్గత కుమ్ములాటలతో రచ్చ రేపుతున్నాయి. పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక మేరకు ఎన్సీపీ కార్యనిర్వహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌, లోక్‌సభ సభ్యుడు సునీల్‌ తత్కారేను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిద్దరినీ బహిష్కరించినట్ల పవార్ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు కూడా లేఖ పంపినట్లు ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌ వెల్లడించారు.

అయితే తిరుగుబాటు నేతలపై శరద్‌ పవార్ తీసుకున్న చర్యలు చెల్లవని ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని.. మెజార్టీ నిర్ణయాలను శరద్‌ పవార్ గౌరవించాలని కోరారు. పవార్ ఆశీస్సులను తాము కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా జయంత్ పాటిల్‌ను తప్పించి.. ఆ స్థానంలో ఎంపీ సునీల్ తత్కారేను నియమిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్‌ ప్రకటించారు. అజిత్ పవార్‌ ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతారని వెల్లడించారు. రూపాలి చకాంకర్‌ను ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన ప్రఫుల్‌ పటేల్.. ఎమ్మెల్సీ అమోల్‌ మిట్కారీ, అనంద్‌ పరాంజిపేను పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు.

అటు జయంత్ పాటిల్‌ సహా పవార్‌ వర్గం NCP శాసనసభాపక్ష నేతగా నియమించిన.. జితేంద్ర అవహద్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరినట్లు అజిత్ పవార్ చెప్పారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని పార్టీ తమదేనని చెప్పిన అజిత్ పవార్ తాము పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. అయితే తన ఆశీస్సులతోనే.. అజిత్ పవార్‌ మహారాష్ట్ర మంత్రివర్గంలో చేరినట్లు జరుగుతున్న ప్రచారాన్ని శరద్ పవార్ ఖండించారు. 2019లో ఏర్పడిన మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని కొందరు కూలదోశారన్న పవార్.. ఇలాంటివి మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయన్నారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని 2020 మార్చిలో పడగొట్టారని గుర్తుచేశారు.

Tags

Read MoreRead Less
Next Story