ISRO Aditya L1 : ఇస్రో మరో అరుదైన ఘనత

ISRO Aditya L1 : ఇస్రో మరో అరుదైన ఘనత
లగ్రాంజ్ పాయింట్ కు ఆదిత్య-ఎల్1,ఘనతపై మోడీ ట్వీట్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య ఎల్‌- 1 వ్యౌమనౌకను లాగ్రాంజ్‌ పాయింట్‌కు చేర్చింది. తద్వారా అంతరిక్షంలో భారత్‌కు చెందిన తొలి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో ప్రకటించగా మోదీ పోస్ట్‌ను ఇస్రో రీపోస్ట్‌ చేసింది.

సూర్యుడి రహస్యాలను ఛేదించే దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 వ్యోమనౌక..లాగ్రాంజ్‌ పాయింట్‌లోని నిర్దేశిత గమ్యస్థానానికి చేరినట్లు ప్రధాని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. భారత్ మరో మైలురాయిని దాటిందనీ భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 గమ్యస్థానానికి చేరుకుందని ఆయన పోస్ట్‌ చేశారు. సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి.. ఇది నిదర్శనమన్నారు. అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన మోదీ మానవాళి ప్రయోజనాల కోసం సైన్స్‌ను నూతన శిఖరాలకు చేర్చే ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు. ఆదిత్య ఎల్‌-1 విజయంపైప్రధాని మోదీ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ను ఇస్రో రీపోస్ట్ చేసింది. ఆదిత్య L1ను పీఎస్‌ఎల్వీ సీ 57 వాహకనౌక ద్వారా గత ఏడాది సెప్టెంబర్‌ 2న ఇస్రో ప్రయోగించింది. 4నెలల తర్వాత ఆదిత్య ఎల్‌-1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌కు చేరుకుంది. భూమికి, సూర్యుడికి మధ్య గల దూరంలో ఇది కేవలం ఒకశాతం మాత్రమే. అయితే ఎల్‌-1 పాయింట్‌ నుంచి గ్రహణాలు వంటి ఆటంకాలతో సంబంధం లేకుండా నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేయవచ్చని..ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆదిత్య ఎల్‌-1 విద్యుదయస్కాంత, కణ, అయస్కాంతక్షేత్ర డిటెక్టర్ల సాయంతో.. సూర్యుడి ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి వెలుపలి పొర అయిన కొరోనాను..అధ్యయనం చేస్తుంది. కొరోనా ఎలా వేడెక్కుతుంది, కరోనల్‌ మాస్‌ ఎజక్షన్‌, అక్కడి ప్లాస్మా ఉష్ణోగ్రత, సాంద్రతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు... ఇస్రోకు అందిస్తుంది. ఈ అధ్యయనాల వల్ల సౌర తుపానులు సంభవించే అవకాశాలను ముందుగానే శాస్త్రవేత్తలు తెలుసుకునే వీలు ఉంటుంది. సౌర తుపానుల వల్ల ఉపగ్రహాల నుంచి భూమికి అందే సమాచార వ్యవస్థకుఅంతరాయం కలుగుతుంది. ఆదిత్య ఎల్‌-1 పంపించే సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించి అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను సౌర తుపానుల బారి నుంచి కాపాడే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story