Jaishankar: పశ్చిమ దేశాల తీరుపై జైశంకర్‌ చురకలు

Jaishankar: పశ్చిమ దేశాల తీరుపై జైశంకర్‌ చురకలు
సంపూర్ణ పరివర్తన కోసం గ్లోబల్ సౌత్ ఒత్తిడి తెస్తుంటే గ్లోబల్ నార్త్ అడ్డుకుంటుందన్న జైశంకర్

పశ్చిమ దేశాల తీరుపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఫైర్ అయ్యారు. ఇప్పటికీ ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమేనని, ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న దేశాలు మార్పు కోసం ఒత్తిడిని ప్రతిఘటిస్తున్నాయని, చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అసహనం వ్యక్తం చేశారు. న్యూయార్క్ వేదికగా ఆయన పశ్చిమ దేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి, యూఎన్ ఇండియా, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సౌత్ రైజింగ్: పార్ట్‌నర్‌షిప్స్, ఇనిస్టిట్యూషన్స్, అండ్ ఐడియాస్' సమావేశంలో మాట్లాడారు. గతంలో రష్యా- ఉక్రెయిన్ సమస్యపై ఆయన స్పందన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు జైశంకర్‌.

మార్పు కోసం రాజకీయ సంకల్పం కంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆధిపత్య స్థానాల్లో ఉన్న దేశాలు మార్పును ప్రతిఘటిస్తున్నాయన్నారు. భద్రతా మండలిలో ఇలాంటి తీరును ఎక్కువగా గమనిస్తుంటామన్నారు. ఆర్థిక ఆధిపత్యం కలిగినవారు తమ ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటారని, సంస్థాగత లేదా చారిత్రక ప్రభావం ఉన్నవారు ఆ సామర్థ్యాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారన్నారు. వారు సరైన విషయాలే చెబుతారు కానీ, వాస్తవమేమంటే ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమన్నారు. ఇందుకు కోవిడ్ మంచి నిదర్శనమన్నారు.


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ ఆ దేశాల వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా గ్లోబల్ నార్త్‌లో భాగంగా భావించడం లేదన్నారు. గ్లోబల్ నార్త్ అనే పదాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయోగిస్తారని చెప్పిన జైశంకర్‌... వీటిలో ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయన్నారు. గ్లోబల్ సౌత్ అనే పదాన్ని అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలకు ఉపయోగిస్తారని.. వీటిలో ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయని తెలిపారు. గ్లోబల్ సౌత్ కు లీడర్ షిప్ గా భారతదేశం అవతరిస్తుందని చెప్పారు.

సాంస్కృతిక బ్యాలెన్స్ అంటే వైవిధ్యాన్ని గుర్తించడం, గౌరవించడమే కాదని, ఇతర సంస్కృతులను, సంప్రదాయాలకు తగిన గౌరవం కూడా ఇవ్వాలన్నారు. కాగా, గ్లోబల్ నార్త్ అనే పదాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు, గ్లోబల్ సౌత్ అనే పదాన్ని అభివృద్ధి చెందుతోన్న, అభివృద్ధి చెందని దేశాలకు ఉపయోగిస్తారు.


Tags

Read MoreRead Less
Next Story