కష్టాలు గట్టెక్కాయి... కూలి పని చేసుకునే మహిళలకు లాటరీలో రూ. 10 కోట్లు

కష్టాలు గట్టెక్కాయి... కూలి పని చేసుకునే మహిళలకు లాటరీలో రూ. 10 కోట్లు
లక్ష్మీదేవి అందరినీ వరించదు. దానిక్కూడా అదృష్టం ఉండాలి. కష్టపడి సంపాదిస్తే ఆ పూటకి కడుపు నిండుతుందేమో కానీ కోట్లు సంపాదించడం తమ వల్ల అవుతుందా..

లక్ష్మీదేవి అందరినీ వరించదు. దానిక్కూడా అదృష్టం ఉండాలి. కష్టపడి సంపాదిస్తే ఆ పూటకి కడుపు నిండుతుందేమో కానీ కోట్లు సంపాదించడం తమ వల్ల అవుతుందా.. కలలో కూడా ఊహించలేదు.. తాము కోటీశ్వరులం అవుతామని.. అప్పు చేసి మరీ లాటరీ టికెట్ కొన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు.. లక్ష్మీదేవి ఏ మూడ్ లో ఉందో వారికి లక్కు తెచ్చిపెట్టింది. అంతే రూ.250 లు పెట్టి కొన్న లాటరీ టికెట్ కి రూ.10 కోట్లు వచ్చాయంటే ఆ 11 మంది మహిళలు నమ్మలేకపోతున్నారు.. అందరూ కలిసి లాటరీ టికెట్ కొన్నారు.. ఆ వచ్చిన డబ్బుని కూడా అందరూ కలిసి పంచుకోవాలనుకుంటున్నారు.

కేరళ లాటరీ టికెట్ వారికి జాక్‌పాట్ తెచ్చిపెట్టింది. రూ. 250 విలువైన లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి వారి వద్ద డబ్బు లేదు. అయినా అప్పు చేసి కొన్నారు. ఇక్కడి పరప్పనంగడి మున్సిపాలిటీ పరిధిలోని హరిత కర్మ సేన సభ్యులు 11 మంది మహిళలను బుధవారం జరిగిన డ్రా తర్వాత కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ వారు రూ. 10 కోట్ల మాన్‌సూన్ బంపర్ విజేతలుగా ప్రకటించారు.

"మేము ఇంతకు ముందు కూడా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసాము. కానీ ఎప్పుడూ చాలా తక్కువ మొత్తంలో వచ్చేది. కానీ మెగా ప్రైజ్ గెలవడం ఇదే మొదటిసారి" అని తన సహోద్యోగుల నుండి డబ్బు సేకరించి టిక్కెట్‌ను కొనుగోలు చేసిన రాధ ఆనందంతో చెబుతోంది. మరో మహిళ మాట్లాడుతూ, తాము డ్రా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, పొరుగున ఉన్న పాలక్కాడ్‌లో విక్రయించిన టిక్కెట్‌కు మొదటి బహుమతి వచ్చిందని ఎవరో చెప్పడంతో బాధపడ్డానని చెప్పారు. "చివరికి జాక్‌పాట్ తగిలిందని తెలియగానే ఉద్వేగానికి, ఆనందానికి అవధులు లేవు. మేము అందరం జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాము. డబ్బు మా సమస్యల పరిష్కారానికి కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది" అని ఆమె చెప్పింది.

మహిళలు తమ అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. హరిత కర్మ సేన సభ్యులుగా వారు తీసుకునే జీతం వారి కుటుంబాలకు ఏకైక ఆదాయం. హరిత కర్మ సేన గృహాలు, సంస్థల నుండి నాన్-బయోడిగ్రేడబుల్ వ్యర్థాల సేకరణలో నిమగ్నమై ఉంది. వాటిని రీసైక్లింగ్ కోసం ష్రెడింగ్ యూనిట్లకు పంపుతుంది.

మున్సిపాలిటీలోని హరిత కర్మ సేన కన్సార్టియం చైర్మన్ షీజ మాట్లాడుతూ.. విజేతలందరూ చాలా కష్టపడి పనిచేసే వారని, వారి కుటుంబానికి ఏకైక ఆదాయ వనరు అని ఆమె అన్నారు. "చాలామందికి అప్పులు ఉన్నాయి.. పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. వారి కష్టాలు ఈ డబ్బుతో తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లాటరీ విజేతలను కలుసుకుని వారిని అభినందించేందుకు గురువారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడి మున్సిపాలిటీ గోడౌన్ ఆవరణకు తరలివచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story