కైలాస పర్వతాన్ని సందర్శించిన మోదీ.. ఇక్కడికి వెళ్ళిన మొదటి ప్రధాని

కైలాస పర్వతాన్ని సందర్శించిన మోదీ.. ఇక్కడికి వెళ్ళిన మొదటి ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లోని కైలాష్ వ్యూ పాయింట్ నుంచి ఆది కైలాసాన్ని సందర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లోని కైలాష్ వ్యూ పాయింట్ నుంచి ఆది కైలాసాన్ని సందర్శించారు. కైలాస పర్వతం స్పష్టంగా కనిపించే జోలింగ్‌కాంగ్ ప్రాంతంలో ఈ వ్యూ పాయింట్ ఉంది. ఇందుకోసం చైనా ఆక్రమించిన టిబెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

దీనితో పాటు పార్వతీ కుండ్ వద్ద ప్రధాని ప్రార్థనలు చేశారు. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో చైనా సరిహద్దు మొదలవుతుంది. ఉత్తరాఖండ్‌లోని భారత్-చైనా సరిహద్దులో ఉన్న ఆది కైలాస పర్వతాన్ని సందర్శించిన దేశానికి తొలి ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం. ప్రధానమంత్రి ఆది కైలాస పర్వతం ముందు ధ్యానం కూడా చేశారు. ప్రధాని శివ-శక్తి ఆలయంలో హారతి నిర్వహించారు. పార్వతీ కుండ్ వద్ద పూజ సమయంలో ప్రధానమంత్రి డ్రమ్ము వాయించడంతో పాటు శంఖం పూరించారు.

అక్కడి నుంచి మోదీ 14000 అడుగుల ఎత్తులో ఉన్న గుంజి గ్రామానికి చేరుకున్నారు. ఇది ఉత్తరాఖండ్‌లోని ధార్చుల నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆయన స్థానిక ప్రజలను కలిశారు. ఈ గ్రామం రాబోయే రెండేళ్లలో పెద్ద మతపరమైన నగరమైన శివధామ్‌గా అభివృద్ధి చెందనుంది. ధార్చుల తర్వాత, కైలాష్ వ్యూ పాయింట్, ఓం పర్వతం మరియు ఆది కైలాష్‌లను సందర్శించడానికి వచ్చే భక్తులకు ఇది ముఖ్యమైన విడిదిగా మారనుంది. ఇక్కడ గెస్ట్ హౌస్ లు, హోటళ్లు నిర్మించనున్నారు. భారతీయ టెలికాం కంపెనీల నెట్‌వర్క్ కూడా అందుబాటులో ఉంటుంది.

గుంజి వ్యాస్ లోయలో సురక్షితమైన భూమిలో ఉంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడే ప్రమాదం కానీ వరదలు వచ్చే అవకాశం కానీ లేదు. ప్రస్తుతం ఇక్కడ 20 నుంచి 25 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఈ గ్రామం కైలాస యాత్రికుల సౌకర్యానికి అనువుగా ఉంటుంది. ప్రధాని మధ్యాహ్నం అల్మోరాలోని జగేశ్వర్ ధామ్ చేరుకున్నారు. ఇక్కడ శివలింగానికి పూలు, నీళ్లు సమర్పించి స్వామివారికి హారతి ఇచ్చారు. దాదాపు 6200 అడుగుల ఎత్తులో ఉన్న జగేశ్వర్ ధామ్‌లో 224 రాతి దేవాలయాలు ఉన్నాయి.

గ్రామీణాభివృద్ధి, రోడ్లు, విద్యుత్, నీటిపారుదల, తాగునీరు, ఉద్యానవనం, విద్య, ఆరోగ్యం మరియు విపత్తు నిర్వహణ వంటి రంగాలకు సంబంధించిన సుమారు రూ. 4200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను పితోర్‌గఢ్‌లో ప్రధాని ప్రారంభించారు. ప్రధాని పర్యటన వల్ల పర్యాటక రంగం విస్తరిస్తుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story