కాసేపట్లో తెలంగాణలో అడుగు పెట్టనున్న మోదీ

కాసేపట్లో  తెలంగాణలో అడుగు పెట్టనున్న మోదీ
6110 కోట్ల రూపాయలతో చేపట్టే జాతీయ రహదారులు, 521 కోట్ల రూపాయలతో చేపట్టే కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ అండ్ మ్యానిప్యాక్షరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.

కాసేపట్లో ప్రధాని మోదీ తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటనకు సర్వంసిద్ధమైంది. ఉదయం 9.45 గం.లకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటల నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో భద్రకాళి గుడికి చేరుకుంటారు. దర్శనం, అమ్మవారికి పూజలు అనంతరం 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంకు చేరుకుంటారు మోదీ. ఆ తర్వాత 6110 కోట్ల రూపాయలతో చేపట్టే జాతీయ రహదారులు, 521 కోట్ల రూపాయలతో చేపట్టే కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ అండ్ మ్యానిప్యాక్షరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11.45 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత 12.50 గంటలకు వరంగల్ మామునూరు హెలిప్యాడ్‌ నుంచి హకీంపేటకు పయనమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు మోదీ తిరుగు పయనమవుతారు. దీంతో మోదీ తెలంగాణ టూర్‌ ముగుస్తుంది.

అటు ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. మోదీ, బీజేపీ కటౌట్‌లు, పార్టీ జెండాలు, తోరణాలతో ఓరుగల్లు కాషాయమయంగా మారింది. సభకు లక్షలాది మందితో జనసమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి జనాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జనసమీకరణ కోసం ఇన్‌చార్జ్‌లను నియమించారు. కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడి అయ్యాక జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మోదీ పర్యటనకు రెండు రోజుల ముందే వరంగల్‌కు చేరుకున్న కిషన్‌రెడ్డి.. అక్కడే మకాం వేసి సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నారు.

ఇక తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఓరుగల్లు బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ బీజేపీ నాయకులకు మోదీ ఎలాంటి భరోసా ఇస్తారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై ప్రధాని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారా? రెండు పార్టీల ఆరోపణలకు మోదీ ఇచ్చే రియాక్షన్ ఏంటి కౌంటర్ ఏంరేంజ్‌లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story