దేశంలో కొండెక్కిన ఉల్లి ధరలు... రంగంలోకి దిగిన కేంద్రం

దేశంలో కొండెక్కిన ఉల్లి ధరలు... రంగంలోకి దిగిన కేంద్రం


దేశంలో ఉల్లి ధరలు కొండెక్కడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి ఎగుమతులపై ఏకంగా 40 శాతం సుంకం విధించింది. పెంచిన సుంకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. డిసెంబర్‌ 31 వరకు పెంచిన సుంకం అమల్లో ఉంటుందని కేంద్రం పేర్కొంది. అకాల వర్షాలు, అనావృష్టి కారణంగా ఈ సీజన్‌లో ఉల్లి పంట విస్తీర్ణం భారీగా తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధాన మార్కెట్లలో కిలో ఉల్లి ధర 60 రూపాయలు దాటింది.

త్వరలోనే కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉల్లి ధరలు హాట్‌ టాపిక్‌గా మార్చే ఛాన్స్‌ ఉంది. దీంతో వెంటనే ఉల్లి సరఫరా పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గోదాముల నుంచి బహిరంగ మార్కెట్‌లోకి భారీగా ఉల్లిని విడుదల చేయడంతో పాటు.. ఎగుమతులపై సుంకం విధించింది. దీంతో దేశీయంగా సరఫరా పెరిగి.. ధరలు తగ్గుముఖం పడుతాయని కేంద్రం భావిస్తోంది.

ఇక టమోటాలు, కూరగాయలు, మసాలా దినుసుల ధరలలో పెరుగుదల కారణంగా మే తర్వాత ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడం ప్రారంభమైంది. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత 7 శాతం దాటింది. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ తన బులెటిన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ త్రైమాసికంలో 6 శాతం కంటే ఎక్కువగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని చాలా నగరాల్లో రిటైల్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణ ధోరణికి టొమాటో ప్రత్యేకించి కారణమని పరిగణిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story