Raj Thackeray: మహారాష్ట్రలో గరిష్ట సీట్లపై బీజేపీ కన్ను

Raj Thackeray: మహారాష్ట్రలో గరిష్ట సీట్లపై బీజేపీ కన్ను
అమిత్‌షాను కలిసిన రాజ్‌థాకరే..

సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమి 4వందల సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా అందుకోసం ఇతర పార్టీలకు స్నేహహస్తం చాటుతోంది. ఇండియా కూటమిలోని పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా ముంబయిలో కొంతమేర పట్టు ఉన్న మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన -M.N.Sను ఎన్డీయేలోకి ఆహ్వానించేందుకు భాజపా సిద్ధమైంది. తద్వారా ఉద్ధవ్‌ ఠాక్రేకు చెక్‌ పెట్టాలని యోచిస్తోంది.

మహారాష్ట్రలో NDA కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. శివసేన ఉద్ధవ్‌ వర్గం భారీ సంఖ్యలో ఓట్లను చీల్చకుండా NDA కూటమి తమ వ్యూహానికి మరింత పదును పెట్టింది. వీలైనన్ని పార్టీలను చేర్చుకొని మహారాష్ట్రలో అత్యధిక లోక్‌సభ స్థానాలను సాధించాలని చూస్తోంది. ఉద్ధవ్‌ సోదరుడు, మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన-MNS అధినేత రాజ్‌ ఠాక్రేను తమ జట్టులో చేర్చుకొనేందుకు NDA పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్‌ ఠాక్రే తన కుమారుడుతో కలిసి దిల్లీలో హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన NDA కూటమిలో చేరడం ఖాయమనే ప్రచారం జోరందుకొంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి మహారాష్ట్రలో పోటీ చేసింది. ఆ సమయంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో 41 చోట్ల విజయం సాధించింది. కొన్ని నెలల తర్వాత జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ కూటమి విజయం సాధించింది. అధికారం పంచుకొనే విషయంలో ఇరు పక్షాల మధ్య విభేదాలు తలెత్తడంతో శివసేన..... NDAను వీడి కాంగ్రెస్‌-ఎన్సీపీతో జట్టుకట్టింది. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కొంతకాలం సజావుగా సాగినా 2022లో శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గం తిరుగుబాటు ప్రకటించింది. వీరు భాజపాతో చేతులు కలపడంతో మహారాష్ట్రలో అధికారం NDA వశమైంది. ఆ తర్వాత పార్టీ, గుర్తును ఉద్ధవ్‌ వర్గం కోల్పోయింది. ఆ సమయంలో రాజ్‌ ఠాక్రే..... శిందే వర్గానికి మద్దతుగా నిలిచారు. ఉద్ధవ్‌ కారణంగానే పార్టీ చీలిపోయిందని ఆరోపించారు. మరోవైపు NCPలో కూడా అజిత్‌ పవార్‌ నేతృత్వంలో తిరుగుబాటు చోటు చేసుకొంది. అత్యధిక మంది NDAతో జట్టుకట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్‌ వర్గానికి సానుభూతి లభిస్తే ప్రతికూలంగా మారుతుందని భాజపా అంచనా వేస్తోంది. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కావడంతో ఏ మాత్రం రిస్క్‌ చేయడానికి ఇష్టపడటంలేదు. అందుకే ఠాక్రే కుటుంబంలోని మరో ప్రజాకర్షక నేత రాజ్‌ ఠాక్రేను తమ పక్షాన చేర్చుకొనేందుకు NDA పావులు కదుతుపుతోంది.

బాల్‌ ఠాక్రేకు స్వయాన సోదరుడి కుమారుడే రాజ్‌ ఠాక్రే. ఆయన ఉద్ధవ్‌తో విభేదాల కారణంగా 2006లో శివసేన నుంచి బయటకు వెళ్లిపోయారు. 2009లో అతడి నేతృత్వంలోని MNS 13 ఎమ్మెల్యే స్థానాలను సాధించింది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఆ పార్టీ తిరిగి బలపడాలంటే ఓ పెద్ద అండ అవసరం ఉంది. అది భాజపా రూపంలో లభిస్తుందని రాజ్‌ ఠాక్రే ఆశిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story