Sabarimala: దర్శనాలకు సిద్ధమైన శబరిమల..

Sabarimala: దర్శనాలకు సిద్ధమైన శబరిమల..
నవంబర్‌ 17న తెరచుకోనున్న ఆలయం

|దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళ శబరిమలై అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం వార్షిక వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్‌ 17 వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణ వెల్లడించారు. రెండు నెలలపాటు కొనసాగే ఈ అయ్యప్ప మహా దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఆధునాతన టెక్నాలజీతో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

సన్నిధానంలో భక్తుల భారీ రద్దీని నియంత్రించడానికి డైనమిక్ క్యూ కంట్రోల్ వ్యవస్థను తీసుకొచ్చామని కే రాధాకృష్ణ తెలిపారు. నిలాక్కల్, పంబా, సన్నిధానం ప్రాంతాల్లో వీడియో స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పంబా-సన్నిధానం రూట్‌లోనే 15 ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. శబరిమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను వారికి తెలియజేయాలని దేవస్థానం సిబ్బందిని కోరారు. శబరిమల వార్షిక వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటివరకు 6 సార్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ఈ 6 సమావేశాల్లో రెండు సార్లు సీఎం పినరయి విజయన్‌ కూడా పాల్గొన్నారని మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు.


ఏటా శీతాకాలంలో నిర్వహించే ఈ అయ్యప్ప దర్శనాలు రెండు నెలల పాటు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మకర సంక్రాంతికి కనిపించే మకర జ్యోతి కోసం దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. కేవలం అయ్యప్ప మాల వేసుకున్న భక్తులే కాకుండా సామాన్య భక్తులు కూడా అయ్యప్ప దర్శనం కోసం వస్తూ ఉంటారు. దీంతో సాధారణంగానే అత్యంత రద్దీగా ఉండే అయ్యప్ప క్షేత్రం.. మకర జ్యోతి సమయానికి కిక్కిరిసిపోయి ఉంటుంది. మలయాళ నెల వృశ్చికం మొదటి రోజు మండల మకర విలక్కు దర్శనాలు ప్రారంభం అవుతాయి. జనవరి రెండో వారంలో మకర జ్యోతి దర్శనం తర్వాత కొన్ని రోజులకు అయ్యప్ప ఆలయం మూసేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story