Budget 2024-25: ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Budget 2024-25: ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
మొరార్జీ దేశాయ్ రికార్డ్‌ స‌మం

పార్లమెంటులో వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ సమం చేశారు. ఆర్థిక మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్‌కు వ‌రుస‌గా ఇది ఆరో బ‌డ్జెట్‌. మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ త‌ర్వాత వ‌రుస‌గా ఆరు సార్లు బ‌డ్జెట్ ప్ర‌తిపాదించిన రికార్డును నిర్మ‌లా సీతారామ‌న్ సొంతం చేసుకున్నారు. మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ 1962లో తొలిసారి, 1967లో రెండో తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌తిపాదించారు. పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లో ఆరు బ‌డ్జెట్‌లు స‌మ‌ర్పించిన ఘ‌న‌త ఆయ‌న‌దే.

ఇక గతంతో పోలిస్తే ఈసారి ఆమె తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు. నిర్మలా సీతారామన్‌ ఇప్పటివరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం మాట్లాడారు. ఈసారి ఆమె దేశ పద్దును 57 నిమిషాల్లో లోక్‌సభ వేదికగా దేశ ప్రజలకు వినిపించారు. ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పాటు, అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్‌ 135 నిమిషాల పాటు ప్రసంగించారు. 2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ పూర్తిస్థాయి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు.

Tags

Read MoreRead Less
Next Story