కోచింగ్ సెంటర్ లో పాఠం వింటున్న 18 ఏళ్ల విద్యార్థి.. హఠాత్తుగా గుండెపోటుతో..

కోచింగ్ సెంటర్ లో పాఠం వింటున్న 18 ఏళ్ల విద్యార్థి.. హఠాత్తుగా గుండెపోటుతో..
సైలెంట్ కిల్లర్ హార్ట్ ఎటాక్ అన్నెం పున్నెం ఎరుగని అమాయక యువతీ యువకుల్ని హరించి వేస్తోంది.

సైలెంట్ కిల్లర్ హార్ట్ ఎటాక్ అన్నెం పున్నెం ఎరుగని అమాయక యువతీ యువకుల్ని హరించి వేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట రోజుకు ఒకటైనా వెలుగులోకి వస్తోంది. మారిన జీవన శైలి మనిషికి ఊపిరి అందకుండా చేస్తోంది. వత్తిడితో కూడిన చదువులు, ఉద్యోగ వ్యాపారాలు అన్నీ అనారోగ్యం పాలు చేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం ఓ కోచింగ్ సెంటర్ లో లెక్చరర్ పాఠం చెబుతున్న సమయంలో 18 ఏళ్ల యువకుడు మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్ లోధి అనే విద్యార్థి క్లాసు జరుగుతున్న సమయంలో ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో బెంచి మీదకు తల వాల్చాడు. పక్కన కూర్చున్న స్నేహితుడితో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పాడు. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే గమనించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సత్నాకు చెందిన రాజ్‌కు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతను మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) కోసం సిద్ధమవుతున్నాడు.

రాజ్ పక్కనే కూర్చున్న స్నేహితుడు రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. "అతను చేతులు ముడుచుకుని లెక్చరర్ చెప్పేది వింటున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడు అని అనుకున్నాను. కానీ కాసేపటికే అతను అకస్మాత్తుగా డెస్క్ మీదకు వాలిపోయాడు. మొదట, అతను నిద్రపోతున్నాడని నేను అనుకున్నాను, కాని అతని ముఖ కవళికలు మారడం చూశాను. అతను ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పాడు. నేను అతని వీపును రుద్దడానికి ప్రయత్నించాను. కానీ అతని శరీరం బిగుసుకుపోతోంది, బెంచ్ మీద నుండి పడిపోతున్నాడని భావించి వెంటనే కేకలు వేశాను. అందరం కలిసి ఆస్పత్రికి తీసుకువెళ్లాము.. కానీ అప్పటికే అతడి ప్రాణం పోయిందని దు:ఖిస్తూ చెప్పాడు.

రాజ్ కుటుంబం రాత్రి ఇండోర్‌కు చేరుకున్నారు. గురువారం పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. రాజ్ అన్నయ్య అక్షయ్ మాట్లాడుతూ.. తన తమ్ముడు 'ప్రోటీన్ డైట్'లో ఉన్నాడని, ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు జిమ్‌కి వెళ్లేవాడని చెప్పాడు. రాజ్ ఇటీవల జుట్టు రాలుతోందని చింతిస్తున్నాడని, దాని కోసం కూడా కొన్ని మాత్రలు వేసుకుంటున్నాడని అక్షయ్ చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story